సుంకాలు, వాణిజ్య ఒప్పందాలు, భారత్, పాకిస్తాన్(India, Pakistan) మధ్య సైనిక ఘర్షణలు వంటి విషయాలపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన ప్రకటనలు భారత్‌కు అసౌకర్యంగా మారినట్టుగా భావిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ సైనిక ఘర్షణను నిలిపివేయడంలో అమెరికా పాత్ర ఉందనే ప్రకటనలపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది భారత విదేశాంగ విధాన వైఫల్యమంటూ విమర్శలు గుప్పించాయి. ఈ విషయంపై యూరోపియన్ వార్తాపత్రిక ఒకటి, యూరప్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ప్రశ్నించింది. ‘అమెరికాతో సంబంధాలు భారత్‌కు చాలా కీలకం. కానీ, ఇవి ప్రత్యేకంగా ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినవి కావు.’ అని జైశంకర్ సమాధానమిచ్చారు.
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందాలు
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందాల గురించి చర్చించేందుకు జైశంకర్ యూరప్ వెళ్లారు. ఇరుపక్షాలూ ఒక ఒప్పందానికి వచ్చినట్టు చెబుతున్నారు. భారత్-యూరోపియన్ యూనియన్ తొలి వ్యూహాత్మక చర్చల ముగింపును తెలియజేస్తూ జైశంకర్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. ”రక్షణ, సముద్ర భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం , సైబర్, ఏఐ, అంతరిక్ష రంగాల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి నిర్మాణాత్మక చర్చ జరిగింది. ఇండో-పసిఫిక్, యూరప్, పశ్చిమాసియాలలో పరిస్థితులపైనా మా అభిప్రాయాలను పంచుకున్నాం.” అని జైశంకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్ విశ్వసనీయతపై జైశంకర్ ఏమన్నారు?
యురాక్టివ్ అనే వెబ్‌సైట్ జైశంకర్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ వెబ్‌సైట్ యూరోపియన్ యూనియన్ విధానాలపై దృష్టి సారిస్తుంటుంది. ఈ ఇంటర్వ్యూలో ”మీరు డోనల్డ్ ట్రంప్‌ను నమ్ముతారా?” అని జైశంకర్‌ను ప్రశ్నించారు. ” దానర్థం ఏమిటి?” అని జైశంకర్ అడిగారు. ”ట్రంప్ తాను చెప్పేమాటపై నిలబడతారా? భారత్ తన సంబంధాలను లోతుగా బలోపేతం చేసుకోవాలనుకునే భాగస్వామి ఆయనేనా?” అని జర్నలిస్టు ప్రశ్నించారు. ”మా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతి సంబంధాన్ని కొనసాగించడమే మా లక్ష్యం. అమెరికాతో సంబంధాలు మాకు చాలా ముఖ్యం. ఇది ‘ఎక్స్’ అనే వ్యక్తితోనో లేదా వై అనే అధ్యక్షుడితోనో ముడిపడి ఉండవు.” అన్నారు.
చెప్పాలంటే, ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, సుంకాల విషయంలో భారత్‌ను పదేపదే లక్ష్యంగా చేసుకున్నారు. భారత్‌ను పలుసార్లు ‘టారిఫ్ కింగ్’ గానూ వర్ణించారు. అమెరికా నుంచి భారత వలసదారులను బహిష్కరించడం నుంచి అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన సమయంలో ట్రంప్ ప్రకటనల వరకు ప్రతిదీ వివాదాస్పదమైంది. భారత్-పాకిస్తాన్ మధ్యలో ఇటీవల నెలకొన్న ఘర్షణ సమయంలో కాల్పుల విరమణ గురించి ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ముందుగా ప్రకటించడంపై వివాదం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమనే ఘనతను కూడా ట్రంప్ తీసేసుకున్నారు.
భారత్ సందేశం ప్రజలకు ఎందుకు చేరడం లేదు?
పహల్గాం దాడి తర్వాత జరిగిన పరిణామాలను రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన దెబ్బకు దెబ్బ చర్యగా అంతర్జాతీయ మీడియా చూపించిందని, భారతదేశ సందేశం ప్రజలందరికీ ఎందుకు చేరడం లేదని జైశంకర్‌ని యురాక్టివ్ జర్నలిస్టు ప్రశ్నించారు. ”ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తి ఉండేవారు. పశ్చిమ ప్రాంతానికి పక్కనే ఉన్న పాకిస్తాన్ సైనిక పట్టణంలో ఎన్నో ఏళ్ల పాటు ఆయన సురక్షితంగా నివసించారు. ఇది కేవలం భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యగా ప్రపంచం చూడకూడదని నేను కోరుకుంటున్నా. ఇది టెర్రరిజానికి చెందిన విషయం. ఈ టెర్రరిజం తిరిగి వచ్చి, మిమ్మల్ని కూడా వెంటాడుతుంది.” అని అన్నారు.
బ్రస్సెల్స్ పర్యటనలో పాకిస్తాన్‌ను ‘టెర్రరిస్తాన్’గా వర్ణించారు భారత విదేశాంగ మంత్రి.
ట్రంప్ భారత్‌కు సమస్యలు సృష్టిస్తున్నారా?
డోనల్డ్ ట్రంప్ రెండోసారి వైట్‌హౌస్ పగ్గాలు చేపట్టిన తర్వాత, భారత్‌కు సమస్యలు సృష్టించేలా పలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే, రెసిప్రొకల్ టారిఫ్ (పరస్పర సుంకాలు)ను ఎత్తిచూపుతూ భారత్‌పై దాడికి దిగారు. భారత్‌లోని అత్యధిక సుంకాలు అన్యాయమని అన్నారు. జనవరిలో ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడినప్పుడు, అమెరికా రక్షణ పరికరాలను భారత్ ఎక్కువగా కొనాలని ట్రంప్ డిమాండ్ చేశారు. న్యాయమైన విధానంలోనే అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం జరగాలని అన్నారు.
ప్రధాని మోదీ అమెరికా వెళ్లాలని నిర్ణయించుకోవడానికి ముందు, ఫిబ్రవరి తొలి వారంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని చెబుతున్న కొంతమంది వలసదారులను అమెరికా సైనిక విమానంలో భారత్‌కు పంపారు.
Read Also: Edible Oil: ముడి వంట నూనెలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు