అమెరికా(America)లోని లాస్ ఏంజెలెస్(Los Angeles) నగరంలో వలస విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్(Fedaral Immigration) అధికారులు చేపట్టిన దాడులు, విస్తృత తనిఖీలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. శనివారం నుంచి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఇప్పటివరకు పోలీసులు దాదాపు 400 మందిని అరెస్టు చేశారు. ఒక్కరోజే 200 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రదర్శనలు, ఆస్తుల ధ్వంసం, పోలీసులతో ఘర్షణల వంటి ఘటనలతో నగరం అట్టుడుకుతోంది.
దాడుల కారణంగానే నిరసనలు
దక్షిణ కాలిఫోర్నియా, సెంట్రల్ కోస్ట్ ప్రాంతాల్లో పత్రాలు లేని వలసదారులను లక్ష్యంగా చేసుకుని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ముమ్మర దాడులు చేపట్టారు. ఈ దాడుల కారణంగానే నిరసనలు ప్రజ్వరిల్లాయని తెలుస్తోంది. వలసదారుల హక్కుల సంస్థల సమాచారం ప్రకారం, గత వారం నుంచి ఇప్పటివరకు సుమారు 330 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.

పెరిగిపోతున్న అల్లర్లు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని డౌన్‌టౌన్ ప్రాంతంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. వరుసగా నాలుగు రాత్రులుగా నగర కేంద్రంలో హింస, లూటీలు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. 23కు పైగా వ్యాపార సంస్థలు లూటీకి గురయ్యాయని తెలిపారు.
14 మందిపై ఫెడరల్ అభియోగాలు నమోదు
అరెస్టు అయిన వారిపై చట్టవ్యతిరేకంగా గుమిగూడటం, విధ్వంసం, దొంగతనం వంటి ఆరోపణలతో పాటు, పోలీసులపై మొలొటోవ్ కాక్‌టెయిల్‌లు విసరడం, పోలీసు వాహన శ్రేణిలోకి వాహనాలను నడపడం వంటి తీవ్రమైన అభియోగాలు కూడా నమోదు చేసినట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వివరించారు. డిస్ట్రిక్ట్ అటార్నీ హోచ్‌మన్ మాట్లాడుతూ, కనీసం 14 మందిపై ఫెడరల్ అభియోగాలు నమోదు చేశామని, ఇతరులపై స్థానిక చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
వలస సమాజాలను లక్ష్యంగా దాడులు
ఇమ్మిగ్రేషన్ అధికారుల కఠిన చర్యలపై కాలిఫోర్నియా రాష్ట్ర నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ గావిన్ న్యూసమ్ మాట్లాడుతూ… ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది ఫెడరల్ దళాలను లాస్ ఏంజెలెస్‌కు పంపి, వలస సమాజాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం ద్వారా అశాంతికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాలతో వలస సమాజాలలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Read Also: Vijay Mallya: వివిధ దేశాల్లో విజయ్ మాల్యా ఆస్తులివే?