భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సమయంలో భారత నౌకాదళం ప్రదర్శించిన అద్భుతమైన సముద్ర సంసిద్ధతను కొనియాడారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఉగ్రవాద స్థావరాలను మన వాయుసేన ధ్వంసం
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, “శక్తిమంతమైన దాడులతో భారత్ దూసుకురావడంతో, సైనిక చర్యలను ఆపాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. మనం మన నిబంధనలకు అనుగుణంగానే ఆపరేషన్‌ను నిలిపివేశాం. ఆ సమయంలో నౌకాదళం పాత్ర ప్రశంసనీయం. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేయగా, అదే సమయంలో సముద్రంలో మన నౌకాదళం చూపిన సంసిద్ధత పాకిస్థాన్ నౌకాదళాన్ని కనీసం ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా చేసింది” అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

“మీరు (నౌకాదళం) ముందుగానే మోహరించడంతో పాకిస్థాన్ ధైర్యం దెబ్బతింది. మీరు పాక్‌పై ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. మీ సన్నద్ధతే ఆ దేశానికి బలమైన సందేశాన్ని పంపింది. భారత నౌకాదళ శక్తిని, సైనిక సామర్థ్యాలను చూసి శత్రుదేశం భయంతో వణికిపోయింది” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. “పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే, ఈసారి కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అత్యంత తీవ్రంగా ప్రతిస్పందిస్తాం” అని ఆయన హెచ్చరించారు.
Read Also: Amith Shah: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి ఆగదు : అమిత్ షా