“నా నరాలు తెగిపోయాయి… ఇక నాకేమీ మిగల్లేదు” అని 26 ఏళ్ల పాలస్తీనా(Palestina) మహిళ నౌరా చెప్పారు. కొన్నేళ్లపాటు ఐవీఎఫ్(IVF) చికిత్స తీసుకున్న తర్వాత, ఆమె జూలై 2023లో గర్భం దాల్చారు. గర్భ నిర్థరణ పరీక్ష పాజిటివ్ వచ్చినప్పుడు తనకు పట్టలేనంత సంతోషం కలిగిందంటూ.. అప్పటి క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇంకొంతమంది పిల్లలు కలగాలనే ఆశతో నౌరా, ఆమె భర్త మొహమ్మద్.. గాజా(Gaza) నగరంలోని అల్-బస్మా ఫెర్టిలిటీ సెంటర్‌లో మరో రెండు పిండాలను భద్రపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. “చివరికి నా కల నిజమైందనుకున్నా, కానీ ఇజ్రాయెలీ(Israel)లు వచ్చినరోజే అంతా ముగిసిపోయిందనిపించింది” అని ఆమె అన్నారు.
హమాస్ 2023 అక్టోబర్ 7న సరిహద్దు దాటి చేసిన దాడిలో 1200మంది మరణించారు. 251మందిని బందీలుగా తీసుకువెళ్లారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది.

54,000 మంది మరణించారు
అప్పటి నుంచి గాజాలో కనీసం 54,000 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వేలాది మంది గాజా నివాసితుల్లానే, నౌరా, మొహమ్మద్ కూడా పదే పదే ఒకచోటునుంచి మరోచోటుకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైన ఆహారం, విటమిన్లు, మందులు వారికి అందుబాటులో లేవు.
“భయంకరమైన బాంబు దాడుల మధ్యే గంటలపాటు నడిచి మేం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం” అని మొహమ్మద్ చెప్పారు. నౌరాకు ఏడోనెలలో తీవ్ర రక్తస్రావం అయింది. “రక్తస్రావం అవుతున్నప్పుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఒక్క వాహనం కూడా కనిపించలేదు. చివరికి చెత్త ట్రక్కులో ఆమెను ఆస్పత్రికి తరలించాం” అని మొహమ్మద్ తెలిపారు. “మేం ఆస్పత్రికి వెళ్లేసరికే ఆమెకు గర్భస్రావం మొదలైపోయింది.” నౌరాకి కవలలు… కానీ ఒకరు ప్రాణంలేకుండా పుట్టగా… మరొకరు పుట్టిన కొన్ని గంటల తర్వాత మరణించారు. నెలలు నిండని పిల్లలకోసం ఇంక్యుబేటర్లు అందుబాటులో లేవని మొహమ్మద్ చెప్పారు. ‘‘ అంతా నిమిషంలో ముగిసిపోయింది” అని నౌరా అన్నారు. కవలలను కోల్పోవడమేకాకుండా..వారు ఐవీఎఫ్ కేంద్రంలో భద్రపరుచుకున్న పిండాలు కూడా ధ్వంసమయ్యాయి.

‘‘అవి అంకెలు కాదు, తల్లుల కలలు’’
అల్-బస్మా ఫెర్టిలిటీ సెంటర్‌పై 2023 డిసెంబర్ ప్రారంభంలో కాల్పులు జరిగాయని, అది ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బహా ఘలాయిని విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ కాల్పులు ఎప్పుడు జరిగాయనే కచ్చితమైన తేదీని, సమయాన్ని ఆయన చెప్పలేకపోయారు. కానీ ఆయన చెప్పిన అంచనాను ఆధారంగా చేసుకుని ఆ సమయంలో ఫెర్టిలిటీ సెంటర్ పనిచేస్తున్నట్టు అక్కడి సిబ్బంది ఒకరు తెలిపారు.
4,000 పిండాలు, అండం శాంపిల్స్..
క్లినిక్‌లో రెండు ట్యాంకులు ఉన్నాయని, వాటిలో దాదాపు 4,000 పిండాలు, వెయ్యి కంటే ఎక్కువ వీర్యం, అండం శాంపిల్స్ భద్రపరిచినట్టు డాక్టర్ ఘలాయిని చెప్పారు. “శాంపిల్స్‌ని భద్రపరిచే లిక్విడ్ నైట్రోజన్ (ద్రవ నత్రజని)తో నిండి ఉన్న రెండు ఇంక్యుబేటర్లు ధ్వంసమయ్యాయి, అవి10,000 డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైనవని”ఆయన చెప్పారు. ఆ ట్యాంకులను తరచుగా నైట్రోజన్‌తో నింపాలని… షెల్లింగ్‌కి రెండు వారాల ముందే ట్యాంకుల్లో నైట్రోజన్ స్థాయి తగ్గడం మొదలైందని ఆయన అన్నారు. “అల్-నుసీరాత్‌లోని నైట్రోజన్ గిడ్డంగికి చేరుకుని, రెండు ట్యాంకులను తీసుకున్నాను”, కానీ దాడుల తీవ్రత కారణంగా దాదాపు 12 కి.మీ దూరంలో ఉన్న క్లినిక్‌కు వాటిని తీసుకెళ్లలేకపోయాను.. ఆలోపే షెల్లింగ్ జరిగింది…ఇక ఆ ట్యాంకులతో పనిలేకుండాపోయింది” అని లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అజ్జూర్ చెప్పారు. షెల్లింగ్ తర్వాత ఆయన దక్షిణ గాజాకు వెళ్లిపోయారు.
చెదిరిపోయిన తల్లుల ఆశలు..
డాక్టర్ ఘలాయిని మాట్లాడుతూ, ఈ లాబొరేటరీలో మా సొంత క్లినిక్‌లతో పాటు ఇతర క్లినిక్‌లలో చికిత్స పొందుతున్నవారి కోసం కూడా పిండాలను భద్రపరిచాం. నేను 4,000 పిండాల గురించి మాట్లాడుతున్నాను. ఇవి కేవలం అంకెలు కాదు…ప్రజల కలలు. ఏళ్లతరబడి ఎదురుచూసి, బాధాకరమైన చికిత్సలు చేయించుకుని, వీటిపై తల్లులు పెట్టుకున్నఆశలు…కానీ చివరికి అన్నీ చెదిరిపోయాయి.”వంద నుంచి నూటయాభై మంది మహిళలు పిల్లలు పుట్టేందుకు తమకున్న చివరి అవకాశాన్ని కోల్పోయారని ఆయన అన్నారు.
Read Also: Hamas Leader: హమాస్ అగ్రనేత సిన్వర్ హతం..ఇజ్రాయెల్ ప్రధాని ధ్రువీకరణ