దౌత్యవేత్తల పునర్ నియామకంపై భారత్- కెనడా మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా(Canada)కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగానే ఈ దౌత్యవేత్తల పునర్ నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో గత రెండేళ్లుగా పతనమవుతూ వస్తున్న ఇరుదేశాల సంబంధాలు బలోపేతయమయ్యే అవకాశం ఉంది.

సాధారణ సేవలను పునరుద్ధరించే లక్ష్యంతో..
ఇరుదేశాల పౌరులు, వ్యాపారాలకు సాధారణ సేవలను పునరుద్ధరించే లక్ష్యంతో కొత్త హై కమిషనర్లను నియమించడానికి అంగీకరించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. ఈ సమావేశం ముఖ్యమైనదని భావిస్తున్నానని అన్నారు. జీ7 అధ్యక్షుడిగా ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక జీ7 ఎజెండాలోని ముఖ్య అంశాలైన అంతర్జాతీయ నేరాలు, అణచివేత, భద్రత గురించి ప్రధాని మార్క్ కార్నీ ప్రస్తావించారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్-కెనడా సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆహార భద్రత, కీలకమైన ఖనిజాల్లో సహాకరం పెంచుకోవడంపై చర్చలు జరిగాయి.
జీ7 సందర్భంగా కెనడా, భారత్ ప్రధానుల మధ్య సానుకూల, నిర్మాణాత్మక సమావేశం జరిగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘ఈ భేటీలో ఇరుదేశాల భాగస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం, న్యాయపాలన వంటి అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య బలోపేతమైన చర్యలకు అడుగులు పడ్డాయి. అందులో మొదటిది హై కమిషనర్ల పునర్ నియామకం’ అని ప్రకటనలో ఉంది.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి
2023లో ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే కెనడా-భారత్ రాయబారులను వెనక్కి పిలిపించారు. కెనడాలో ఉగ్రవాదం, భారత్ వ్యతిరేక కార్యకలాపాలపై భారత్ పదేపదే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాంటి శక్తులపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరుతోంది.
Read Also: Europe: యూరప్‌లో చౌకగా విహరించదలచిన వారికోసం టాప్ 5 దేశాలు