ఇవాళ గుజరాత్(Gujarath) లోని అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్(London) కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం అనూహ్యంగా సెకన్లలోనే కుప్పకూలిపోయింది. ఎయిర్ పోర్టు రన్ వే నుంచి టేకాఫ్ తీసుకోగానే సెకన్ల వ్యవధిలో ఇళ్లపై నుంచి ఎగురుతూ విమానం ఎలా కుప్పకూలిపోయిందో తెలియజేసే వీడియో ఫుటేజ్ బయటికి వచ్చింది. అక్కడే ఉన్న ఇళ్లలో ఉన్న వారు దీన్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు.
విమానం కొన్ని సెకన్ల పాటు ప్రయాణిస్తున్న దృశ్యాలు
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన తర్వాత ఇళ్లపై నుంచి విమానం కొన్ని సెకన్ల పాటు ప్రయాణిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. అనంతరం క్రమంగా విమానం ఎగురుతున్న ఎత్తు నుంచి కిందికి దిగిపోతున్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత మరికొన్ని సెకన్లలోనే విమానం పడిపోవడం లేదా గాల్లోనే పేలిపోవడం జరిగిపోయింది. దీంతో వీడియోను పూర్తిగా మంటలు కమ్మేసినట్లు కనిపించింది. దీన్ని బట్టి చూస్తే విమానం చాలా తక్కువ ఎత్తులోనే పేలిపోయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎయిర్ ఇండియాతో పాటు డీజీసీఏ కూడా ఈ విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ ప్రారంభించాయి. ఇందులో విమానం కుప్పకూలడానికి గల ప్రాథమిక కారణాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వీడియో దృశ్యాలను బట్టి చూస్తుంటే ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మంటల్లో ప్రయాణికులంతా దాదాపుగా కాలిపోయి మృత్యువాత పడినట్లు అర్దమవుతోంది. అయితే పేలుడు నేపథ్యంలో విమానం దగ్గరకు ఇంకా సహాయక బృందాలు చేరుకోలేదని తెలుస్తోంది.
Read Also: Plane crash: కుప్పకూలిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం