పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పాక్ పౌరులు భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

786మంది పాకిస్థాన్‌కు వెళ్లారు
ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ఉన్న బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్న పాక్ పౌరులు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టంచేసింది. వైద్య వీసాల కింద ఉన్నవారికి ఏప్రిల్ 29లోపు వెళ్లిపోవాలని గడువు ఇచ్చింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారికి ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో భారత్ ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ వరకు 786మంది పాకిస్థాన్‌కు వెళ్లారు. 1376మంది పౌరులు భారత్‌కు తిరిగి వచ్చారు. అటు పాకిస్థాన్‌లో ఉంటున్న భారతీయులు కూడా వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి రావాలని హెచ్చరించింది.
రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వెరిఫికేషన్
పాకిస్థాన్‌కు నేరుగా విమానాలు లేకపోవడం వల్ల చాలా మంది దుబాయ్ లేదా ఇతర మార్గాల ద్వారా విమానంలో వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పాక్ పౌరులను గుర్తిస్తున్నామని అన్నారు. దీంతో మరికొంతమంది దేశం విడిచి వెళ్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర నిఘా సంస్థల సమన్వయంతో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందని అన్నారు.
ఇండియాలో ఉంటే అరెస్టే
ఇక ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మనదేశంలోనే తిష్టవేసిన పాకిస్థానీయులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్- 2025’ ప్రకారం ఇండియాలో ఉండే పాక్ పౌరులను అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ చట్టం కింద అరెస్టైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Jammu : లోయలో పడ్డ CRPF జవాన్ల వాహనం