గత నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (AP) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వరద నీటిలో ఈత, చేపలు పట్టే చర్యలకు దూరంగా ఉండాలని వారు సూచించారు.
ప్రాజెక్టుల్లో వరద నీటి మట్టం పెరుగుతుంది – ముందస్తు చర్యల్లో అధికారులు
గోదావరి (Godavari) వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో పలు ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. భద్రాచలం వద్ద 35.6 అడుగులు, కూనవరం వద్ద 14.9 మీటర్లు, పోలవరం వద్ద 10.23 మీటర్లు, ధవళేశ్వరం వద్ద ఇన్-అవుట్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుంగభద్ర నదిలో కూడా 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతోంది. ఇప్పటికీ ప్రాజెక్టులు హెచ్చరిక స్థాయికి చేరకపోయినా, అధికారులు ముందస్తుగా అప్రమత్తమవుతూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజలు అధికారులు సూచనల ప్రకారం ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు.
టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు – సహాయక చర్యలకు సిద్ధంగా యంత్రాంగం
వర్షాల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల నిర్వహణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. సహాయక చర్యల కోసం ప్రజలు 112, 1070, లేదా 1800 425 0101 నంబర్లకు సంప్రదించవచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు, లోతట్టు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ ప్రాంత పరిస్థితిని అధికారులకు తెలియజేయాలని సూచించారు. మంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.
Read Also : Fake Apples: మార్కెట్లో నకిలీ యాపిల్స్..జాగ్రత్త సుమీ !!