Epic Movie: సంచలనాత్మక చిత్రం ‘బేబీ’ తర్వాత టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్‌తో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తమ్ముడి ఎంపికలపై గర్వంగా ఉంది: విజయ్ దేవరకొండ
ఈ కార్యక్రమంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ’90s’ సిరీస్ చూసినప్పుడే దర్శకుడు ఆదిత్యతో సినిమా చేయాలనిపించిందని, తరుణ్ భాస్కర్ తొలి సినిమా కోసం ఎంతగా ఎదురుచూశానో ఆదిత్య డెబ్యూ కోసం కూడా అలాగే వేచి చూశానని తెలిపారు. అలాంటి ప్రతిభావంతుడి మొదటి చిత్రంలో తన తమ్ముడు ఆనంద్ నటించడం అదృష్టమని, ఆనంద్ స్క్రిప్ట్స్ ఎంపిక చూస్తుంటే గర్వంగా ఉంటుందని అన్నారు. ‘ఎపిక్’ చిత్రం ఆనంద్ కెరీర్‌లో మరో అద్భుతమైన సినిమాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని, ‘ఎపిక్’తో ఈ పరంపర మరింత కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read also: Ranabali Teaser: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ వచ్చేసింది
Epic Movie: సహజమైన నటనకు అద్దం పట్టే చిత్రం: సందీప్ రెడ్డి వంగా
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఆనంద్ ఐటీ ఉద్యోగం చేసే రోజుల నుంచే సినిమాలపై అతనికి ఉన్న నిజమైన ప్యాషన్‌ను చూసి ఆశ్చర్యపోయానని గుర్తుచేసుకున్నారు. ఏ పాత్రనైనా ఎంతో సహజంగా పండిచగల సామర్థ్యం ఆనంద్ సొంతమని ప్రశంసించారు. దర్శకుడు ఆదిత్య రచనలో అద్భుతమైన పరిణతి కనిపిస్తోందని, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల అందరి మనసులను హత్తుకుని ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
నెగెటివ్ కామెంట్స్‌పై స్పందించిన మేకర్స్
ట్రైలర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని నెగెటివ్ కామెంట్స్‌పై నిర్మాత నాగవంశీ మరియు దర్శకుడు ఆదిత్య హాసన్ స్పష్టతనిచ్చారు. నిజ జీవితంలో ఒక యువతీయువకుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే ఈ చిత్రంలో చూపించామని, ఇది కుటుంబమంతా కలిసి హాయిగా థియేటర్లలో చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్ అని నాగవంశీ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అశ్లీలతకు తావులేదని భరోసానిచ్చారు. ప్రేక్షకులు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోమని దర్శకుడు ఆదిత్య హాసన్ పేర్కొన్నారు.
అందరినీ అలరించే సహజ ప్రేమకథ: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ఇది మనందరి చుట్టూ జరిగే కథ అని, భారీ ట్విస్టులు, రక్తపాతాలు లేకుండా అత్యంత సహజంగా సాగే చక్కటి ప్రేమకథ అని తెలిపారు. అన్నయ్య విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకకు విచ్చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘కడలి’ పాత్ర ద్వారా తాను నటిగా ఎంతో నేర్చుకున్నానని, సందీప్ రెడ్డి సినిమాల్లోని హీరోయిన్ పాత్రల మాదిరిగానే ఇందులో తన పాత్ర చాలా బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 10న ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా, సెప్టెంబర్ 11న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :