తిరుమల ఆధ్యాత్మికత, పచ్చదనం పెంపొందించేందుకు టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. కొండల్లో పచ్చదనం పెంచేందుకు భారీగా నిధులు కేటాయించనున్నారు.తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) అధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఈవో శ్యామలరావు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని మరింత పెంచనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. తిరుమల కొండల్లో ప్రస్తుతం 68.14 శాతంగా ఉన్న పచ్చదనాన్ని అటవీశాఖ ద్వారా 80 శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు,ఇందుకోసం దశలవారీగా 2025-26 సంవత్సరంలో రూ.1.74కోట్లు, 2026-27లో రూ.1.13కోట్లు, 2027-28లో రూ.1.13కోట్లు అటవీశాఖకు విడుదల చేసేందుకు టీటీడీ(TTD) పాలకమండలి నిర్ణయించింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం ఆలయం, నాగాలాపురం ఆలయం, ఒంటిమిట్ట ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన టీటీడీ.. ఇందుకోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేయనుంది. ఈ ప్లాన్ తయారీ కోసం ఆర్కిటెక్టుల నుంచి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అందుబాటు
మరోవైపు తిరుమలలోని విశ్రాంతి గృహాల పేర్లను మార్చుతున్న సంగతి తెలిసిందే. అయితే పేర్లు మార్చని రెండు గెస్ట్‌హౌస్‌ల పేర్లను టీటీడీనే మార్చాలని నిర్ణయించారు. ఇక శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన భోజనం అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్స్ ఫీజులను పేరొందిన సంస్థలకే ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలలో ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచాలని ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి(Tirupati Swims Hospital)కి ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న రూ. 60 కోట్లకు అదనంగా మరో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం లభించింది. స్విమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ నియామకానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.శ్రీవారి వైద్య సేవను అందుబాటులోకి తీసుకురావటం సహా టీటీడీలో పని చేస్తున్న అన్యమతస్తులను బదిలీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా తిరుమల భద్రతపై టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాలజీ(Anti-drone technology) వాడాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించింది. ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలు పెంచాలని నిర్ణయించిన టీటీడీ తుళ్లూరు మండలం అనంతవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పదికోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
Read Also: Rohingyas: రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ముప్పు: పవన్ కళ్యాణ్