తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకీపెరుగుతోంది.ఈ నేపథ్యంలో,ఆదివారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90 వేలను దాటింది. మొత్తం 90,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,007 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి సేవకులు
ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.52 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ (Alwar Tank Guest House) వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.వేసవి సెలవుల కారణంగా గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.
టోకెన్ల జారీ
వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్లు చేసింది. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లల్లో మార్పులు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. గతంలో శ్రీవారి మెట్టు మార్గాన ఉన్న కౌంటర్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్ (Alipiri Bhudevi Complex) లోకి మార్చారు. ఇక్కడ దివ్యదర్శనం టోకెన్ల జారీ సైతం ప్రారంభమైంది.

రవాణా వ్యవస్థ
భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎస్ఎస్డీ టోకెన్లను జారీ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండటం, దివ్యదర్శనం టోకెన్లను తీసుకున్న భక్తులు ఇక్కడి నుంచి శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్లడానికి రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండటం వల్ల టీటీడీ ఈ మార్పు చేసింది. ఇక్కడ రోజూ 5,000 వరకు టోకెన్లను భక్తులకు అందజేస్తోంది టీటీడీ.ఇది తాత్కాలికమే. ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ లో ఉన్న శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్ ను త్వరలోనే శ్రీనివాస మంగాపురం ఆలయానికి తరలించే అవకాశాలు ఉన్నాయి.
పురావస్తు శాఖ
అక్కడ ఈ కౌంటర్లను ఏర్పాటు చేయడానికి టీటీడీ అధికారులు ఇదివరకే సన్నాహాలు చేపట్టారు. శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) లో టోకెన్ల కౌంటర్ ను ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ నుంచి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు చేపట్టింది టీటీడీ. పురావస్తు శాఖ నుంచి అనుమతులు రావడానికి కొంత సమయం పట్టనుంది. ఈ అనుమతులు లభించిన వెంటనే శ్రీనివాస మంగాపురానికి మార్చనుంది.
Read Also: Madanapalle: భార్య కళ్లెదుటే భర్త హత్య..తల పట్టుకున్న పోలీసులు