కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకున్న రౌడీ షీటర్ సుహాస్ షెట్టి దారుణ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ సమగ్ర దర్యాప్తునకు పట్టుబట్టింది. విశ్వ హిందూ పరిషత్ దక్షిణ కన్నడ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.మంగళూరు సమీపంలోని బజపెలో గురువారం రాత్రి సుహాస్ షెట్టి దారుణ హత్యకు గురయ్యారు. 2022 నాటి ఫజల్ హత్యకేసులో అతను ప్రధాన నిందితుడు. బజపె పోలీస్ స్టేషన్ పరిధిలోని కైకంబ వద్ద ఇన్నోవా కారులో వెళ్తోన్న సుహాస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. తొలుత పికప్ వెహికల్‌తో కారును ఢీకొట్టారు. దీనితో వాగ్వివాదానికి దిగిన సుహాస్‌ను కత్తులతో పొడిచి చంపారు.
ప్రాధాన్యత
ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బీజేపీ ఆందోళనలకు దిగింది. విశ్వ హిందూ పరిషత్ జిల్లా వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. పలు పట్టణాల్లో బస్సుల రాకపోకలు స్తంభించాయి. దుకాణాలు మూత పడ్డాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు మంగళూరు నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్, అదనపు డీజీపీ హితేంద్ర తెలిపారు. ఈ హత్య నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ అందినట్లు స్వయంగా సిద్దరామయ్య వెల్లడించారు. దీని వెనుక ఉన్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. తనకు కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ అందినట్లు మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు. సుహాస్ షెట్టి హత్యకు పాల్పడిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిద్ధరామయ్య చెప్పారు. ఈ హత్యకు గల కారణం ఇంకా తెలియట్లేదని, రౌడీషీటర్ కావడం వల్ల పాతకక్షలు ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని అన్నారు.

కోణంలో
సుహాస్ షెట్టి హత్యపై బీజేపీ రాజకీయం చేయడాన్ని సిద్ధరామయ్య తేలిగ్గా తీసుకున్నారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాల పని అదేనని చురకలు అంటించారు. ఈ హత్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, చట్టపరంగా శిక్షించి తీరుతామని తేల్చి చెప్పారాయన. దీన్ని ఇంకో కోణంలో చూడకూడదని వ్యాఖ్యానించారు.
Read Also: America :భారత్‌కు మా సంపూర్ణ మద్దతు.. టామీ బ్రూస్