Digital farming: ప్రకృతి పొలంలో ‘డిజిటల్ ‘ సాగు

Follow Us: Google News Daily Hunt
AI in Agriculture smart farming tools
AI in Agriculture smart farming tools
FONT SIZE
GET APP

Digital farming:”శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామమైన నవనంబాడులో ఒక చిన్న రైతు ఉదయం పొలానికి బయలుదేరే ముందు తన మొబైల్ ఫోన్ ను చూస్తాడు. ఆ రోజున వర్షం పడే అవకాశం ఉందని, మరో రెండు రోజుల వరకు నీటిపారుదల అవసరం లేదని, అంతేకాదు పొలంలోని ఒక మూలలో తెగులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని తన మొబైల్ లోని ఒక అప్లికేషన్ అతన్ని నోటిఫికేషన్ ద్వారా హెచ్చరిస్తుంది.”

ఇది ఒక ఊహాజనిత దృశ్యంలా అనిపించవచ్చు, కానీ వాస్తవం దిశగా వేగంగా కదులుతున్న వ్యవసాయ రంగంలో మేధ (ఎఐ) ఇప్పటికే అడుగుపెట్టడం ప్రారంభించింది. రాబోయే కాలంలో వాతావరణ అంచనాల నుంచి పంట ఆరోగ్య విశ్లేషణ వరకు ప్రతి దశలో డిజిటల్ సహాయం రైతు నిర్ణయాల్లో భాగం కానుంది. మన భరతమాత ముద్దు బిడ్డ రైతన్న శతాబ్దాలుగా ప్రకృతిని పరిశీలిస్తూ తరతరాల అనుభవాన్ని ఆధారంగా చేసుకుని తన గుండె చప్పుడైన వ్యవసాయాన్ని సాగు చేస్తున్నాడు. అయితే ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో సవాళ్లు వ్యవసాయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన వ్యవసాయానికి కృత్రిమ మేధ కేవలం ఒక తాత్కాలిక సాంకేతిక పరిష్కారంగా మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపే ఒక విప్లవాత్మక శక్తిగా మారబోతోంది.

Read also: Schools reopening: బడుల వేడుక జ్ఞానానికి వేదిక

గత దశాబ్ద కాలంలో మన దేశం గణనీయమైన డిజిటల్ మార్పును చూసింది. స్మార్ట్ ఫోన్లు పల్లెలోని సగటు రైతు చేతుల్లోకి చేరడంతో ఆర్థిక కార్యకలాపాల నుండి ఆన్లైన్ సేవలు వరకు మొబైల్ యాప్లు గ్రామీణ జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఈ పరిణామం వ్యవసాయ రంగంపైనా సానుకూల ప్రభావం చూపింది. ఒకప్పుడు రైతు సమాచారం కోసం వ్యవసాయ అధికారులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు అదే రైతు తన మొబైల్ ఫోన్ ద్వారా వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సలహాలు నేరుగా తెలుసుకునే స్థితికి చేరాడు. ఈ డిజిటల్ విప్లవానికి తదుపరి దశగా నిలుస్తున్న కృత్రిమ మేధ, రైతులకు కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో విశ్లేషించి చెప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Digital farming:ఉత్పాదక పెంపుతోనే గ్రామీణ వికాసం

దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయ రంగం, దేశ జీడీపీకి అందిస్తున్న వాటా దాదాపు 15 నుండి 18 శాతం మాత్రమే ఉండటం ఇక్కడి అసమతుల్యతను స్పష్టం చేస్తోంది. వ్యవసాయంపై ఆధారపడుతున్న జనాభా అధికంగా ఉన్నా ఈ రంగం ద్వారా సృష్టించబడుతున్న ఆర్థిక విలువ పరిమితంగానే ఉంది. ఫలితంగా రైతుల ఆదాయాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ఇక్కడే ఉత్పాదకత అంశం కీలకంగా మారుతుంది. అదే భూమి, అదే నీరు, అదే శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, మార్కెట్ అనుసంధా నాన్ని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే వ్యవసాయ ఆదాయాలను పెంచడం సాధ్యమవుతుంది. మన దేశంలో మొబైల్ కనెక్టివిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఉపగ్రహ డేటా, డిజిటల్ భూ రికార్డులు వంటి డిజిటల్ మోలిక వసతుల విస్తరణ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయానికి ఎంతో అనుకూల పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ వ్యవస్థ అందు బాటులో ఉన్న సమాచారం నుంచి స్వయంగా నేర్చుకుని నమూనాలను గుర్తిస్తుంది, అంచనాలు వేస్తుంది, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.

ఉదా: ఒక ప్రాంతానికి సంబంధించిన గత ఇరవై సంవత్సరాల వర్షపాతం వివరాలు, నేల లక్షణాలు, పంటల చరిత్ర, మార్కెట్ ధరల వంటి సమాచారాన్ని విశ్లేషించి రైతుకు ఏ పంట సాగు చేస్తే ఎక్కువ లాభం వస్తుందో సూచించగలదు. వ్యవసాయంలో తీసుకునే ప్రతి ఎంపిక, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, తెగుళ్ల నియంత్రణ, మార్కెటింగ్ లాంటివి నేరుగా ఆర్థిక ఫలితాలను ప్రభావితం చేసే నిర్ణయాలను మరింత కచ్చితంగా డేటా ఆధారంగా తీసుకోవడంలో కృత్రిమ మేధ రైతులకు సహకరించి పరోక్షంగా రైతు ఆదాయాన్ని పెంచుతుంది. అప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని పెంచి చిన్న వ్యాపారాల అభివృద్ధికి దోహదపడుతుంది. అందువల్ల ఈ కృత్రిమ మేధను కేవలం సాంకేతిక కోణంలో మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థికాభివృద్ధి దృష్టితో కూడా చూడాల్సిన అవసరం ఉంది.

వాస్తవాలు చెబుతున్న గణాంకాలు: మన దేశ అభివృద్ధికి జాతీయ వ్యూహాలను రూపొందిస్తున్న నీతి ఆయోగ్ వ్యవసాయ రంగాన్ని కృత్రిమ మేధ అత్యధిక ప్రభావం చూపగల కీలక రంగాలలో ఒకటిగా గుర్తించింది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, స్మార్ట్ మొబిలిటీ వంటి రంగాల్లో దీని వినియోగం దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమని స్పష్టం చేసింది. వివిధ పైలట్ ప్రాజెక్టులు కూడా ఆశాజనక ఫలితాలను అందించాయి. డేటా ఆధారిత సాగు విధానాలను అనుసరించిన ప్రాంతాల్లో నీటి వినియోగం తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగిన సందర్భాలు కూడా నమోదయ్యాయి. అదే విధంగా తెగుళ్లను ముందుగానే గుర్తించడం ద్వారా పంట నష్టాలను గణనీయంగా తగ్గించగలిగినట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

సాంప్రదాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేధ

వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడే రంగం కావడంతో రైతు నిర్ణయాల్లో అనిశ్చితి సహజంగా ఉంటుంది. ఈ అనిశ్చితి తగ్గించడం వ్యవసాయ అభివృద్ధిలో కీలక అంశంగా మారింది. తరతరాలుగా రైతులు తమ అనుభవాన్ని ఆధారంగా చేసుకుని నీటి నిర్వహణ, ఎరువుల వినియోగం, పంట సంరక్షణ వంటి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఈ అనుభవానికి అపారమైన విలువ ఉన్నప్పటికీ, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిమితులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ ఖిప్రిసిషన్ అగ్రికల్చర్ని అంటే కచ్చితత్వ వ్యవసాయం ఒక సమర్థవంతమైన పరిష్కారంగా ఎదుగుతోంది.

ఇందులో పొలాన్ని ఒకే మొత్తంగా కాకుండా చిన్న చిన్న భాగాలుగా విభజించి విశ్లేషిస్తారు. ప్రతి భాగంలో నేల స్వభావం, తేమ స్థాయి, పోషక విలువలు, పంట ఆరోగ్యం వంటి అంశాలను విడివిడిగా అధ్యయనం చేస్తారు. ఈ విశ్లేషణ ఆధారంగా ఎక్కడ ఎంత నీరు అవసరం, ఎక్కడ ఎరువులు అవసరం, ఎక్కడ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉందో కచ్చితంగా గుర్తించవచ్చు. ఫలితంగా వనరుల వృథా తగ్గి ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. గతంలో మట్టి నమూనాలను ప్రయోగశాలలకు పంపించి ఫలితాల కోసం రోజులు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పోర్టబుల్ పరీక్షా పరికరాలు, డిజిటల్ విశ్లేషణ వ్యవస్థలు చాలా వేగంగా సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ డేటాను కృత్రిమ మేధ విశ్లేషించి రైతుకు ఆచరణాత్మక సూచనలు ఇస్తుంది.

తెగుళ్ల గుర్తింపు పంట సంరక్షణలో కొత్త దశ

వ్యవసాయంలో అత్యధిక నష్టాలకు కారణమయ్యేవి తెగుళ్లు, వ్యాధులే. చాలాసార్లు రైతు సమస్యను గుర్తించే సమయానికి నష్టం అప్పటికే జరిగిపోయి ఉంటుంది. వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించలేకపోవడం వల్ల కొన్నిసార్లు మొత్తం పంటే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యకు కృత్రిమ మేధ ఇప్పుడు సమర్థవంతమైన పరిష్కారంగా మారుతోంది. ఆధునిక కెమెరాలు, డ్రోన్లు, చిత్ర విశ్లేషణ సాంకేతికతల ద్వారా పంటల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం సాధ్యమవుతోంది. ఆకుల రంగులో వచ్చే స్వల్ప మార్పులు, పెరుగుదలలో కనిపించే అసాధారణ లక్షణాలు, వ్యాధి ప్రారంభ సంకేతాలు వంటి సూచనలను ఈ వ్యవస్థలు గుర్తించగలవు. మానవ కంటికి కనిపించేలోపే సమస్యను గుర్తించే సామర్థ్యం వీటి ప్రత్యేకత. ఇంతకు మునుపు రైతులు మొత్తం పొలానికి ఒకేసారి మందులు పిచికారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు సమస్య ఉన్న ప్రాంతాలను మాత్రమే గుర్తించి, అక్కడే చికిత్స చేయడం సాధ్యమవుతోంది. దీనివల్ల రసాయనాల వినియోగం తగ్గుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అలాగే పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. వ్యవసాయంలో స్థిరత్వం సాధించాలంటే పంట సంరక్షణ మరింత శాస్త్రీయంగా మారాలి. ఈ మార్పుకు కృత్రిమ మేధ కీలకంగా దోహదపడుతోంది.

వ్యవసాయ విజయాన్ని నిర్ణయించే అత్యంత కీలక అంశాలలో వాతావరణం ప్రధానమైనది. మన దేశంలో ఇప్పటికీ సాగుభూమిలో గణనీయమైన భాగం వర్షపాతంపైనే ఆధారపడి ఉంది. అందువల్ల వర్షం ఆలస్యమైతే, అధికంగా కురిస్తే లేదా అసలు కురవకపోతే రైతుల ఆర్థిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల, రుతుపవనాల అనిశ్చితి వంటి కారణాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేటి తరుణంలో కృత్రిమ మేధ ఆధారిత వాతావరణ నమూనాలు రైతులకు మరింత కచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఉపగ్రహ చిత్రాల వాతావరణ కేంద్రాల డేటా, చారిత్రక వర్షపాతం వివరాలు, ఉష్ణోగ్రతల ధోరణులు వంటి సమాచారాన్ని విశ్లేషించి ప్రాంతాల వారీగా అంచనాలు రూపొందిస్తాయి. దీంతో రైతులు విత్తనాలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు నీరు పెట్టాలి, ఎప్పుడు కోతకు సిద్ధం కావాలి వంటి నిర్ణయాలను ముందుగానే తీసుకునే అవకాశం కలుగుతుంది.

మరోవైపు మార్కెట్ ధరల అనిశ్చితి కూడా భారతీయ రైతులకు పెద్ద సవాలుగా ఉంది. పంట బాగా పండినప్పుడు ధరలు పడిపోవడం, ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తి తక్కువగా ఉండటం వంటి పరిస్థితులు తరచూ కనిపిస్తాయి. ఈ సమస్యకు కూడా కృత్రిమ మేధ ఆధారిత అంచనాలు కొంతవరకు పరిష్కారం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో డిమాండ్, సరఫరా, వినియోగ ధోరణులు, నిల్వలు, ఎగుమతి అవకాశాలు వంటి అంశాలను విశ్లేషించి భవిష్యత్ ధరలపై అంచనాలు వేయడం సాధ్యమవుతుంది. దీని ద్వారా రైతులు పంటల ఎంపికలో మరింత సమాచారం ఆధారిత నిర్ణయాలు తీసుకునే అవకాశం పొందుతారు.

విదేశాల్లో ఆధునిక వ్యవసాయ పోకడలు

అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు వ్యవసాయ ఉత్పాదకత పెంపులో డిజిటల్ సాంకేతికతల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. భవిష్యత్తు వ్యవసాయం కేవలం భూమి, నీరు, శ్రమపై మాత్రమే కాకుండా సమాచారం, డేటా విశ్లేషణ, సాంకేతికతపై కూడా ఆధారపడనుందని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ వంటి దేశాలు కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ పద్ధతుల్లో ముందంజలో ఉన్నాయి.

మన దేశంలో ఎఐ అన్వయం

మన దేశంలో కూడా ఇండో ఇజ్రాయెల్ అగ్రీ ప్రాజెక్ట్స్ ద్వారా ఇలాంటి ఆధునిక పద్దతులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగువుతున్నాయి. భారతదేశ వ్యవసాయ రంగంలో జరుగుతున్న డిజిటల్ పరివర్తనలో అగ్రిటెక్ స్టార్టప్ల పాత్ర కూడా కీలకం. పంటల ఆరోగ్య విశ్లేషణ, డ్రోన్ సేవలు, మార్కెట్ సమాచారం, భూసార పరీక్షలు, సరఫరా గొలుసు నిర్వహణ, బీమా సేవలు వంటి అనేక రంగాల్లో ఇవి వినూత్న పరిష్కారాలను అందిస్తున్నాయి. ఒకప్పుడు రైతులు మార్కెట్ సమాచారం కోసం మధ్యవర్తులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ వేదికల ద్వారా ధరలు, కొనుగోలుదారుల వివరాలు నేరుగా అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయాన్ని కేవలం ఉత్పత్తి ప్రక్రియగా కాకుండా ఒక సమగ్ర విలువ గొలుసుగా మార్చడంలో ఈ స్టార్టప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దేశానికి అనుకూలమైన ప్రత్యేక నమూనాలు అవసరం. ఈ నేపథ్యంలో ‘ఫార్మింగ్ యాజ్ ఎ సర్వీస్’ అంటే సేవగా వ్యవసాయం అనే భావనను తీసుకురావాలి. ఇందులో రైతులు పరికరాలను కొనుగోలు చేయాల్సి న అవసరం ఉండదు. అవసరమైనప్పుడు సేవల రూపంలో వాటిని వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఒక గ్రామంలోని స్టార్టప్ డ్రోన్లను కొనుగోలు చేసి, రైతు భరోసా కేంద్రాలు లేదా స్థానిక సహకార సంఘాల ద్వారా రైతులకు అద్దె ప్రాతిపదికన సేవలు అందించవచ్చు. దీనివల్ల రైతులపై భారీ పెట్టుబడి భారం తగ్గుతుంది. అలాగే స్మార్ట్ఫోన్ ఆధారిత కృత్రిమ మేధ సేవలు భారతదేశానికి అత్యంత అనుకూలమైన పరిష్కారంగా మారవచ్చు. రైతు తన పొలంలోని సమస్యను ఫొటో తీసి పంపితే కృత్రిమ మేధ వ్యవస్థ దానిని విశ్లేషించి స్థానిక భాషలో సూచనలు అందించగలదు. భారతదేశం వంటి భాషా వైవిధ్యం ఉన్న దేశంలో వాయిస్ ఆధారిత సేవలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చదవడం, రాయడం రాని రైతులు కూడా మాట్లాడడం ద్వారా సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారు.

డిజిటల్ అగ్రి మిషన్: భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటల్ పరివర్తనలో భాగంగా ప్రవేశపెట్టిన ‘డిజిటల్ అగ్రీ ‘మిషన్’ ఇక్కడ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది. దీని ప్రధాన లక్ష వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా డిజిటల్ రూపంలో సేకరించడం. కోల్డ్ స్టోరేజ్ నెట్వర్క్ డిజిటల్ మార్కెటింగ్ భారతీయ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంపు ఎంత ముఖ్యమో పంట కోత తర్వాత నిర్వహణ కూడా అంతే కీలకం. ప్రతిసంవత్సరం దేశంలో పండ్లు, కూరగాయలు, పూలు, పాల ఉత్పత్తులు సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం వల్ల గణనీయంగా వృథా అవుతున్నాయి. రైతు ఎంతో శ్రమించి పండించిన పంట మార్కెట్కు చేరకముందే నష్టపోవడం ఇప్పటికీ ఒక పెద్ద సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ ఆధారిత కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. గిడ్డంగుల్లో అమర్చిన సెన్సార్లు ఉష్ణోగ్రత, తేమ, నిల్వ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఈ సమాచారాన్ని కృత్రిమ మేధ విశ్లేషించి ఏ ఉత్పత్తి ఎంత కాలం నాణ్యతను నిలుపుకుంటుందో అంచనా వేస్తుంది. అలాగే ఏ సరుకును ముందుగా మార్కెట్కు పంపాలో సూచిస్తుంది. అదే సమయంలో ఈ వ్యవస్థను డిజిటల్ మార్కెటింగ్ వేదికలతో అనుసంధానించడం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు సరైన మార్కెట్లను గుర్తించగలుగుతారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకుని సరైన సమయంలో విక్రయాలు చేయగలుగుతారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది.

ఆహార భద్రతకు ఒక వ్యూహాత్మక సాధనం

కృత్రిమ మేధ ప్రభావాన్ని కేవలం రైతు ఆదాయాల పెరుగుదల లేదా పంట దిగుబడుల పెంపుతో మాత్రమే అంచనా వేయలేం. ఇది దేశ ఆహార భద్రతను బలోపేతం చేసే కీలక సాధనంగా కూడా ఎదుగుతోంది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ జనాభా మరింత పెరగనుంది. మన దేశం కూడా అధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగనుంది. అయితే మరోవైపు సాగుభూమి విస్తీర్ణం పెరిగే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న భూమిలోనే ఎక్కువ ఉత్పత్తి సాధించడం అత్యవసరంగా మారుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయం కీలక పాత్ర పోషించగలదు. నేల లక్షణాలు, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, పంటల అవసరాలు వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించి, వనరుల సమర్థ వినియోగానికి దారి చూపుతుంది. తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తి సాధించడం ద్వారా భవిష్యత్తులో దేశ ఆహార అవసరాలను తీర్చడంలో కృత్రిమ మేధ ఒక వ్యూహాత్మక భాగస్వామిగా నిలవగలదు. మన దేశంలో పంట బీమా పథకాల అమలులో ప్రధాన సమస్య నష్టాల అంచనా ప్రక్రియ. పంట నష్టపోయిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాల్సి రావడం వల్ల పరిహారం అందడంలో ఆలస్యం జరుగుతోంది. కృత్రిమ మేధ ఆధారిత ఉపగ్రహ విశ్లేషణ వ్యవస్థలు ఈ పరిస్థితిని గణనీయంగా మార్చగలవు.

మహిళా రైతులు.. డిజిటల్ వ్యవసాయం

భారతీయ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనది. విత్తనాల ఎంపిక నుంచి పంట కోత వరకు అనేక దశల్లో వారు ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో వారికి తగిన అవకాశాలు ఇంకా పూర్తిగా అందడం లేదు. స్థానిక భాషల్లో పనిచేసే కృత్రిమ మేధ ఆధారిత వాయిస్ అసిస్టెంట్లు ఈ అంతరాన్ని తగ్గించగలవు. మహిళా రైతులు కేవలం మాటల ద్వారా వ్యవసాయ సలహాలు, వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకునే అవకాశం పొందగలరు. దీని ద్వారా డిజిటల్ సాధికారత పెరిగి గ్రామీణ మహిళల నిర్ణయాధికారం బలపడుతుంది, వ్యవసాయ రంగంలో వారి పాత్రకు మరింత గుర్తింపు లభించే అవకాశమూ పెరుగుతుంది. గ్రామీణ యువతకు కొత్త అవకాశాలు: కృత్రిమ మేధ గురించి చర్చ జరిగినప్పుడు యంత్రాలు ఉద్యోగాలను భర్తీ చేస్తాయనే అభిప్రాయం తరచూ వినిపిస్తుంది. ఈ మేధ రైతు అనుభవాన్ని భర్తీ చేసి శాస్త్రీయ మద్దతు అందించడం మాత్రమేనని మనం గ్రహించాలి. ఇంకా వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది. డ్రోన్ ఆపరేటర్లు, డిజిటల్ వ్యవసాయ సలహాదారులు, వ్యవసాయ డేటా విశ్లేషకులు, సెన్సార్ నిర్వహణ నిపుణులు, అగ్రిటెక్ సేవా ప్రదాతలు వంటి కొత్త వృత్తులు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. వ్యవసాయం, సాంకేతికత కలయిక గ్రామీణ యువతకు కొత్త అవకాశాలను అందిస్తోంది, దీనివల్ల గ్రామాల నుంచి పట్టణాలకు జరిగే వలసలను కొంతవరకు తగ్గించే అవకాశం కూడా ఉంది. విసురుతున్న సవాళ్లు.. డేటా కలోనియలిజం: కృత్రిమ మేధ వ్యవసాయ రంగానికి అనేక అవకాశాలను అందిస్తున్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికత అందుబాటులోకి రావడం ప్రధాన సమస్యగా మారుతోంది. కృత్రిమ మేధ ఆధారిత పరికరాలు, సెన్సార్లు, డ్రోన్లు ప్రారంభ దశలో ఖరీదైనవిగా ఉండే అవకాశం ఉంది.

అదే విధంగా సాంకేతిక అవగాహన లోపం, డిజిటల్ అక్షరాస్యత సమస్యలు, ఇంటర్నెట్ సౌకర్యాల పరిమితులు కూడా పెద్ద అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా విశ్వసనీయమైన డేటా లేమి మరో ముఖ్యమైన సవాలు. తప్పుడు లేదా అసంపూర్ణ సమాచారం ఆధారంగా పనిచేసే కృత్రిమ మేధ వ్యవస్థలు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ మేధ గురించి చర్చిస్తున్నప్పుడు తరచూ విస్మరించబడే కీలక అంశం డేటా యాజమాన్యం. కృత్రిమ మేధ వ్యవస్థల పని తీరు పూర్తిగా డేటాపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతుల భూమి వివరాలు, పంటల నమూనాలు, ఉత్పత్తి సమాచారం, మార్కెట్ ప్రవర్తన భవిష్యత్తులో అత్యంత విలువైన ఆర్థిక వనరులుగా మారే అవకాశం ఉంది. ఈ సమాచారం కొద్దిమంది సాంకేతిక సంస్థల చేతుల్లో కేంద్రీకృతమైతే రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని కొందరు నిపుణులు డేటా కలోనియలిజంగా అభివర్ణిస్తున్నారు. అందువల్ల రైతుల డేటా భద్రత, గోప్యత, యాజమాన్య హక్కులకు సంబంధించిన స్పష్టమైన విధానాలు అవసరం. ఈ సవాళ్లను అధిగమించడానికి ఒక సమగ్ర వ్యూహం అవసరం. సాంకేతికతను వ్యక్తిగత యాజమాన్య నమూనా కంటే ఉమ్మడి వినియోగ నమూనాలో అభివృద్ధి చేయడం మరింత సమర్థవంతమైన మార్గంగా కనిపిస్తోంది. ప్రతి రైతు డ్రోన్ లేదా అధునాతన పరికరాలను స్వయంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, గ్రామీణ సేవా కేంద్రాలు వంటి వ్యవస్థలు ఈ పరికరాలను సమిష్టిగా కొనుగోలు చేసి, అవసరానుసారం అద్దె ప్రాతిపదికన రైతులకు అందించవచ్చు. అదే సమయంలో గ్రామీణ డిజిటల్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం అత్యవసరం. నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, స్థానిక భాషల్లో పనిచేసే డిజిటల్ వేదికలు లేకుండా కృత్రిమ మేధ విస్తరణ సాధ్యం కాదు. మరో ముఖ్యమైన అంశం సంస్థల మధ్య సమన్వయం. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, సాంకేతిక సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించాలి.

భారతీయ వ్యవసాయం.. ఒక భవిష్యత్ దృశ్యం

ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే 2035 నాటికి వ్యవసాయం కేవలం భూమిని దున్ని పంటలు పండించే ప్రక్రియగా కాకుండా డేటా ఆధారిత నిర్ణయాలు, డిజిటల్ విశ్లేషణలు, కృత్రిమ మేధ సలహాలపై ఆధారపడే సమగ్ర వ్యవస్థగా మారవచ్చు. ఒక చిన్న రైతు ఉదయం తన మొబైల్ ఫోన్ను తెరిచిన వెంటనే ఆ రోజు వాతావరణ పరిస్థితులు, నేల తేమ, పంట ఆరోగ్య స్థితి, మార్కెట్ ధరలు, నీటి అవసరం, వ్యాధుల ప్రమాదం వంటి వివరాలు అతని స్థానిక భాషలో అందుబాటులోకి రావచ్చు. అతను అడిగే ప్రశ్నలకు కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ సహాయకుడు వెంటనే సమాధానం ఇవ్వగలడు. పొలాల్లో అమర్చిన సెన్సార్లు, డ్రోన్లు, ఉపగ్రహాలు, మొబైల్ అప్లికేషన్లు, డేటా విశ్లేషణ వ్యవస్థలు పరస్పరం అనుసంధానమై పనిచేసే ఒక సమగ్ర వ్యవస్థ రూపుదిద్దుకోవచ్చు. పంటలకు వ్యాధి సోకే సూచనలు కనిపించిన వెంటనే రైతుకు ముందస్తు హెచ్చరికలు అందే అవకాశం ఉంటుంది. అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే ఎరువులు, పురుగుమందులు వినియోగించే విధానాలు సాధారణమవుతాయి. నీటి నిర్వహణలో కూడా గణనీయమైన మార్పులు సంభవించవచ్చు. భూమిలోని తేమ సంకేతాలను నిరంతరం పరిశీలించే వ్యవస్థలు అవసరమైనంత నీటిని మాత్రమే సరఫరా చేయగలవు. దీని ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గుతుంది. వ్యవసాయ మార్కెటింగ్ రంగం కూడా రూపాంతరం చెందవచ్చు.

నాగలికి తోడైన డిజిటల్ శక్తి

ప్రపంచంలోనే అతిపెద్ద రైతు జనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి. విభిన్న వాతావరణ మండలాలు, పంటల వైవిధ్యం, విస్తారమైన వ్యవసాయ భూభాగం, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక వసతులు మన దేశానికి ప్రత్యేక బలాలుగా నిలుస్తున్నాయి. ఈ బలాలను సమర్థవంతంగా వినియోగించగలిగితే మన దేశం కేవలం కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించే దేశంగా మాత్రమే కాకుండా ప్రపంచానికి వ్యవసాయ సాంకేతిక పరిష్కారాలను అందించే కేంద్రంగా కూడా ఎదగగలదు. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ పెట్టుబడులు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగితే భారతదేశం ప్రపంచ అగ్రిటెక్ రంగంలో నాయకత్వ స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. వేల సంవత్సరాలుగా ప్రకృతిని అర్థం చేసుకుంటూ రైతులు సంపాదించుకున్న అనుభవం భారతీయ వ్యవసాయానికి బలమైన పునాది. నేడు ఆ అనుభవానికి డేటా, విశ్లేషణ, కృత్రిమ మేధ వంటి ఆధునిక సాధనాలు తోడవుతున్నాయి. కృత్రిమ మేధ రైతుకు ప్రత్యామ్నాయం కాదు. అది రైతు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా, కచ్చితంగా మార్చే సహాయక శక్తి. భూసారం నుంచి మార్కెట్ ధరల వరకు, వాతావరణ అంచనాల నుంచి పంట బీమా వరకు వ్యవసాయంలోని ప్రతి దశలో ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం నిజమైన విజయాన్ని సాధించాలంటే అది చిన్న, సన్నకారు రైతులకు కూడా ప్రయోజనాలను సమానంగా అందించగలగాలి. స్థానిక భాషల్లో, తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించగల కృత్రిమ మేధ పరిష్కారాలు అందుబాటులోకి రావాలి. భారతీయ వ్యవసాయ భవిష్యత్తు కేవలం యంత్రాలలో లేదు, రైతు జ్ఞానాన్ని సాంకేతికతతో అనుసంధానించగల సామర్థ్యంలో ఉంది. నాగలి పట్టిన చేతికి డిజిటల్ శక్తి, అనుభవానికి కృత్రిమ మేధ తోడైతే, రేపటి భారతదేశం ఆహార భద్రతలోనే కాదు, వ్యవసాయ నవకల్పనలో కూడా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలువగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు