Yoga Path to Good Health: చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఓ విషాద ఘటన అందరినీ కలచివేసింది. పెళ్లైన నెల రోజుల్లోనే ఓ యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. స్థూలకాయం, మానసిక ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలే ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు భావిస్తున్నారు. కొత్త జీవితంపై ఎన్నో కలలు కన్న అతని భార్య వేదనను మాటల్లో చెప్పడం కష్టం. అకాల మరణం ఒక కుటుంబానికే కాదు, సమాజానికీ తీరని విషాదాన్ని మిగులుస్తుంది. ఇలాంటి ఘటనలు నేడు సమాజంలో పెరుగుతున్నాయి. వృద్ధాప్యంలో సంభవించే సహజ మరణం కన్నా, యవ్వనంలో సంభవించే అకాల మరణాలు మరింత బాధాకరం. జీవనశైలిలో వచ్చిన మార్పులు, మానసిక ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, వ్యసనాలు, జన్యుపరమైన సమస్యలు యువత ప్రాణాలను బలిగొంటున్నాయి.
ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. అధిక రక్తపోటు, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చిన్న వయస్సులోనే గుండెపోటులు పెరుగుతున్నాయి. మరోవైపు తీవ్రమైన ఒత్తిడి, నిరాశ, సరైన కౌన్సెలింగ్ లోపం కారణంగా యువతలో ఆత్మహత్యల సంఖ్య కూడా అధికమవుతోంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు మరింత ప్రాణాంతకంగా మారుతున్నాయి. మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాలు, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని … క్రమం తప్పకుండా ఈ పరిస్థితుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, నిత్య వ్యాయామం, సరైన నిద్ర, మానసిక ప్రశాంతత కోసం సమయం కేటాయించడం అత్యంత అవసరం. భారతీయ ఋషులు వేల యేళ్ల క్రితమే ఈ సమగ్ర ఆరోగ్య మార్గాన్ని ‘యోగ’ రూపంలో మానవాళికి అందించారు. సనాతన ధర్మంలో యోగా అనేది కేవలం వ్యాయామం కాదు; శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే దివ్య సాధనం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించే అద్భుత జీవన విధానం.

Yoga Path to Good Health: యోగ పురుషులు
యోగ సంప్రదాయంలో శివుడిని ‘ఆదియోగి’గా భావిస్తారు. మానవాళికి యోగ జ్ఞానాన్ని అందించిన తొలి గురువుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. అనంతరం మహర్షి పతంజలి యోగా సూత్రాలను సంకలనం చేసి అష్టాంగ యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆధునిక యోగా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమలై కృష్ణమాచార్య యోగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించగా, ఆయన శిష్యులైన బి. కె. ఎస్. అయ్యంగార్, పఠాభి జోయిస్ యోగానికి కొత్త దిశలు చూపించారు. పరమహంస యోగానంద, స్వామి వివేకానంద వంటి మహనీయులు యోగాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్లి విశ్వవ్యాప్తం చేశారు.
జగ్గీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ స్థాపించి ఆధునిక జీవనశైలికి అనుగుణంగా యోగాను, అంతర్గత పరివర్తనను సులభంగా అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. బాబా రామ్ దేవ్ పతంజలి యోగపీఠం ద్వారా భారతదేశంలో యోగాను ప్రతి ఇంటికి చేర్చిన ప్రముఖ యోగ గురువు. ప్రాణాయామం, ఆసనాలలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బి. కె. ఎస్. అయ్యంగార్ ప్రపంచవ్యాప్తంగా ‘అయ్యంగార్ యోగా’ విధానాన్ని స్థాపించారు. యోగాసనాలలో కచ్చితత్వం, శరీర సమతుల్యత వాడకంపై ఈయన ఎక్కువ దృష్టి పెట్టారు.

రవిశంకర్: ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు. శ్వాసక్రియల ద్వారా ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పొందే సుదర్శన క్రియను ప్రపంచానికి పరిచయం చేశారు. స్వామి శివానంద: హిమాలయాలలోని రిషికేశ్ కేంద్రంగా ‘ది డివైన్ లైఫ్ సొసైటీ’ని స్థాపించారు. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాలను మేళవించి సమగ్ర యోగాను బోధించారు. మహర్షి మహేష్ యోగి: ‘ట్రాన్సెండెంటల్ మెడిటేషన్’ (మంత్ర ధ్యానం) ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ఆకర్షించారు. నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రాణాయామం, ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఆసనాలు శరీరానికి వశ్యత, బలం పెంచి కండరాలను దృఢపరుస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగి, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకునే జూన్ 21 ఒక వేడుక మాత్రమే కాదు; ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని గుర్తుచేసే సందేశం. వేగంగా మారుతున్న ఆధునిక జీవితంలో మనిషిని శారీరకంగా, మానసికంగా సమతుల్యంలో ఉంచగల శాశ్వత మార్గం యోగానే.

యోగ అంటే ఆసనాలే కాదు
ప్రస్తుతం ‘యోగ’ అనే పదం వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది శరీరాన్ని వంచే ఆసనాలు, వ్యాయామాలు, లేదా ఫిట్నెస్ కార్యక్రమాలు మాత్రమే. సామాజిక మాధ్యమాలు, ప్రకటనలు, జిమ్ సంస్కృతి వల్ల యోగాన్ని శారీరక వ్యాయామంగా మాత్రమే చాలామంది భావిస్తున్నారు. కానీ నిజానికి యోగం అనేది అంతకంటే ఎంతో గొప్పది, విశాలమైనది, లోతైనది. యోగ అనే పదానికి సంస్కృతంలో ‘కలయిక’ అనే అర్థం ఉంది. అంటే శరీరం, మనస్సు, ఆత్మ.. ఈ మూడింటి సమన్వయం. మనిషి అంతరంగాన్ని ప్రశాంతంగా మార్చి, జీవనాన్ని సమతుల్యంగా నడిపించే మార్గమే యోగం.
పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది భాగాలు ఉన్నాయి. ఇందులో ఆసనం ఒక భాగం మాత్రమే. కానీ నేటి కాలంలో మిగతా ఏడు భాగాలను మరిచి, ఆసనాలనే మొత్తం యోగంగా భావించడం విచారకరం. యోగం మనిషికి ఆరోగ్యాన్ని, ఆలోచనలో స్పష్టతను, మనసుకు ప్రశాంతతను, జీవితానికి నియమశీలతను ఇస్తుంది. యమ, నియమాలు మన నైతిక విలువలను పెంచుతాయి. ప్రాణాయామం శ్వాసను క్రమబద్ధం చేసి మనసును స్థిరపరుస్తుంది. ధ్యానం మనలో ఏకాగ్రతను పెంచి ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తుంది. నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళనలు, అసహనం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగం మనిషికి ఒక ఆత్మీయ ఆశ్రయం. అది కేవలం శరీరాన్ని మలచడం కాదు; మనసును మలచే సాధన. శరీర సౌష్టవం కంటే మనసు ప్రశాంతత ముఖ్యమని యోగం నేర్పుతుంది. కనుక యోగాన్ని కేవలం ఆసనాలకే పరిమితం చేయకుండా, సంపూర్ణ జీవన విధానంగా అర్థం చేసుకోవాలి. నిజమైన యోగం అంటే శరీరం, మనస్సు – ఆత్మ మధ్య సమతుల్యత సాధించడం. అదే యోగం ఆసలైన మహత్తు. యోగం మనిషిని బయటకు అందంగా కాకుండా, లోపల నుండి గొప్పవాడిగా తీర్చిదిద్దే జీవన తత్వం.

పతంజలి అష్టాంగాలు
మహర్షి పతంజలి తన యోగ సూత్రాలలో ఎనిమిది యోగ మార్గాలను కలిపి అష్టాంగ యోగగా సూత్రీకరించారు. ఇవి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ఉపయోగపడే ఒక సమగ్ర జీవన విధానాలు.
- యమ (నైతిక నియమాలు): సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలిపే నియమాలు. అహింస (హింసకు దూరంగా ఉండటం), సత్యం (నిజం మాట్లాడటం), అస్తేయం (దొంగతనం చేయకపోవడం), బ్రహ్మచర్యం (ఇంద్రియ నిగ్రహం), అపరిగ్రహం (అవసరానికి మించి వస్తువులను దాచుకోకపోవడం).
- నియమ (వ్యక్తిగత క్రమశిక్షణ): శరీరాన్ని, మనస్సు ను శుద్ధి చేసుకునే పద్ధతులు: శౌచం (పరిశుభ్రత); సంతోషం (తృప్తిగా ఉండటం): తపస్సు (కఠినమైన సాధన); స్వాధ్యాయం (మంచి పుస్తకాలు, వేదాలు చదవడం); ఈశ్వర ప్రణిధానం (భగవంతునిపై భక్తి, శరణాగతి). 3. ఆసనం (భంగిమలు): శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి వేసే వివిధ యోగాసనాలు. ఇది ధ్యానం కోసం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
- ప్రాణాయామం (శ్వాస నియంత్రణ): శ్వాస పీల్చడం, వదలడం ద్వారా ప్రాణశక్తిని నియంత్రించడం.
- ప్రత్యాహార (ఇంద్రియ నిగ్రహం): బాహ్య విషయాల నుండి మనస్సును, ఇంద్రియాలను వెనక్కి మళ్లించడం. 6. ధారణ (ఏకాగ్రత): మనస్సును ఒకే విషయంపై/దేవునిపై కేంద్రీకరించడం.
- ధ్యాన (ధ్యానం): ఏకాగ్రతను నిరంతరంగా కొనసాగిస్తూ, అంతర్లీనంగా ఉండే దివ్య చైతన్యాన్ని అనుభూతి చెందడం.
- సమాధి (ఆత్మ సాక్షాత్కారం): యోగ సాధనలో చివరి మెట్టు. ఇందులో సాధకుడు తనను తాను మరచి, సమతుల స్థితిని, స్థిత ప్రజ్ఞత సాధిస్తారు.
ఈ అష్టాంగ యోగాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అహం, ఈర్ష్య, ద్వేషం పగ, ప్రతీకార భావాలు తగ్గిపోయాయి. హార్మోన్ల సమతుల్యత కొనసాగుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

యోగాసనాలు
యోగంలో మొత్తం 84 లక్షల ఆసనాలు ఉన్నాయని పౌరాణిక విశ్వాసం. పశువులు, పక్షులు, పువ్వులు, చెట్లను పరిశీలించి యోగ భంగిమలను రూపొందించారు. అందుకే వాటి పేర్లు పెట్టారు. అయితే, వాటిలో 84 ముఖ్యమైనవిగా, వాటిలోనూ 12 ప్రధాన ఆసనాలుగా పరిగణిస్తారు. శారీరక భంగిమల ఆధారంగా ఆసనాలను ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించారు.
- నిలబడి వేసే ఆసనాలు: శరీరానికి బ్యాలెన్స్, శక్తిని, స్థిరత్వాన్ని ఇస్తాయి. ఉదా: తడాసనం (పర్వత భంగిమ), వృక్షాసనం (చెట్టు భంగిమ), త్రికోణాసనం.
- కూర్చుని వేసే ఆసనాలు: ఏకాగ్రతను పెంచుతాయి,
వెన్నెముకను దృఢంగా మారుస్తాయి. ఉదా: పద్మాసనం (తామర భంగిమ), వజ్రాసనం, సుఖాసనం.
- వెల్లకిల పడుకొని వేసే ఆసనాలు: వీపుపై పడుకుని చేసేవి. శరీరాన్ని రిలాక్స్ చేయడానికి, అలసటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఉదా: శవాసనం, సర్వాంగాసనం, హలాసనం.
- బోర్ల పడుకొని వేసే ఆసనాలు: పొట్టపై పడుకుని చేసేవి. వెన్నుముకను వంచడానికి, జీర్ణక్రియను మెరుగు పరచడానికి సహాయపడతాయి. ఉదా: భుజంగాసనం (కోబ్రా భంగిమ), ధనురాసనం (విల్లు భంగిమ), మకరాసనం.
- సమతుల్యత, తలకిందుల ఆసనాలు: నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఉదా: శీర్షాసనం, మయూరాసనం.

సూర్యనమస్కారాలు
సూర్యనమస్కారాలు యోగాసనాలలో అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి దాదాపు 8 యోగాసనాలతో కూడిన 12 దశల క్రమం. వీటిని క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల శారీరక దృఢత్వం, చురుకుదనం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అన్ని యోగాసనాలు ఆచరించడానికి వీలు గాని వారికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
సూర్యనమస్కారాల 12 దశలు:
- ప్రణామాసనం: నిటారుగా నిలబడి, చేతులు జోడించి నమస్కార ముద్రలో ఉండాలి.
- హస్తాసనం: చేతులు పైకెత్తి, వెనుకకు కొద్దిగా వంచాలి.
- పాదాసనం: నడుమును ముందుకు వంచుతూ, రెండు చేతులతో పాదాలను తాకాలి.
- అశ్వసంచలనాసనం: కుడికాలిని వెనక్కి మడిచి, ఎడమ కాలిని మోకాలి వద్ద వంచి పైకి చూడాలి.
- దండాసనం: రెండు కాళ్ళను
- వెనక్కి ఉంచి, శరీరాన్ని ఒకే సరళరేఖలో (ప్లాంక్ భంగిమ) ఉంచాలి.
- అష్టాంగ నమస్కారం:
- మోకాళ్ళు, ఛాతి, గడ్డం నేలకు ఆనిస్తూ, నడుమును కొద్దిగా పైకి లేపాలి.
- భుజంగాసనం: చేతులపై శరీరాన్ని పైకి లేపి, ఛాతిని ముందుకు తెరిచి పైకి చూడాలి.
- పర్వతాసనం: తుంటిని పైకి లేపి, శరీరం వి ఆకారంలో ఉండేలా చూడాలి.
- అశ్వసంచలనాసనం:
- (నాలుగవ దశ వలెనే, ఈసారి ఎడమ కాలిని వెనక్కి ఉంచి కుడి కాలిని ముందుకు వంచాలి).
- పాదాసనం: (మూడవ దశ వలెనే).
- హస్తాసనం: (రెండవ దశ వలెనే).
- ప్రణామాసనం: (మొదటి దశ వలె ముగింపు).
ప్రయోజనాలు
కార్డియో వాస్కులర్ వ్యాయామం: గుండె పనితీరును, మెరుగుపరుస్తుంది. ఉదర భాగానికి మంచి వ్యాయామం అందించి, జీర్ణవ్యవస్థను సక్రమం చేస్తుంది. అధిక కేలరీలను కరిగించి, శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
గమనిక: సూర్యనమస్కారాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయడం మంచిది. వెన్నునొప్పి లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని ఆచరించాలి.

ప్రణామాయాలు
ప్రాణాయామం అనేది శ్వాసను క్రమబద్ధీకరించే ఒక యోగ పద్ధతి. దీనిని క్రమం తప్పకుండా చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి, ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది, శరీరం మొత్తం శక్తివంతంగా మారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు అదుపులో ఉంటాయి. దీర్ఘమైన, నియంత్రిత శ్వాసలు తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది. మెదడుకు ఆక్సిజన్ బాగా అంది మానసిక ప్రశాంత
లభిస్తుంది. గుండె స్పందన రేటును మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గించి అదుపులో ఉంచుతుంది. మనస్సు ను ఒకే చోట కేంద్రీకరించే ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శరీరంలోని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని నాడులు శుద్ధి అవుతాయి. దీనివల్ల ముఖంలో కాంతి పెరుగుతుంది.
ప్రాణాయామాన్ని ఉదయం ఖాళీ కడుపుతో, ప్రారంభకులు రోజుకు 5 నుండి 10 నిమిషాల పాటు, అనుభవజ్ఞుల పర్యవేక్షణలో నేర్చుకుని చేయడం మంచిది.
ప్రాణాయామాలు ప్రధానంగా ఎనిమిది రకాలు
- నాడీ శోధన (అనులోమ విలోమ ): ఒక ముక్కు రంధ్రంతో గాలి పీల్చి, మరొక దానితో వదలడం. దీనివల్ల నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది.
- భస్త్రిక: కమ్మరివాళ్ళు ఊదే కత్తి లాగా వేగంగా శ్వాస తీసుకోవడం, వదలడం. ఇది శరీరాన్ని వేడెక్కిస్తుంది, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
- కపాలభాతి: నెమ్మదిగా శ్వాస పీల్చి, బలంగా వదలడం. కడుపు కొవ్వును తగ్గించడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఇది చాలా మంచిది.
- భ్రమరీ: రెండు చేతుల బొటనవేళ్లతో చెవులను మూసి, మిగతా వేళ్లతో కళ్ళు, ముఖాన్ని కప్పి.. తుమ్మెద లాగా ‘ఓంకార’ శబ్దం చేయడం. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
- ఉజ్జయి (సముద్ర శ్వాస): గొంతును బిగించి, సముద్రపు అలల శబ్దం వచ్చేలా శ్వాస తీసుకోవడం. థైరాయిడ్ సమస్యలను తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుంది.
- శీతలీ: నాలుకను గొట్టంలా మలిచి గాలిని లోపలికి పీల్చడం. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, దాహాన్ని అదుపులో ఉంచుతుంది.
- సూర్య భేదన: కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, ఎడమ దాని ద్వారా వదలడం. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది, బద్ధకాన్ని పోగొడుతుంది.
- చంద్ర భేదన: ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస పీల్చి, కుడిదానితో వదలడం. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

ధ్యానం ప్రధానం
శరీరానికి శారీరక వ్యాయామం ఎంత అవసరమో, మనసుకు అంతకంటే ఎక్కువ అవసరం ధ్యానం. ఇది మనలోని ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధ్యానంలో 108
రకాలు ఉన్నాయి. అయితే అవసరాన్ని బట్టి ధ్యానం అనేక విధాలుగా చేయవచ్చు. అయితే ఐదారు రకాల ధ్యాన ప్రక్రియలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
- మైండుల్నెస్ ధ్యానం: మన ఆలోచనలను, పరిసరాలను గమనిస్తూ, వాటికి స్పందించకుండా తటస్థంగా ఉండటం దీని ప్రత్యేకత.
- ఏకాగ్రత ధ్యానం: శ్వాస మీద ధ్యాస ఉంచడం లేదా ఏదైనా ఒక వస్తువు, శబ్దం (మంత్రం) పై మనసును లగ్నం చేయడం.
- ఆధ్యాత్మిక ధ్యానం: ప్రార్థనల ద్వారా దైవంతో అనుసంధానం అవడం లేదా అంతర్గత శక్తిని అనుభవించడం.
- విపాసన ధ్యానం: శ్వాసను గమనిస్తూ, మనసులోని భావోద్వేగాలను, వాటి మార్పులను విశ్లేషించుకునే పురాతన పద్ధతి.
చైతన్య ధ్యానం: ఒక గురువు లేదా ఆడియో మార్గదర్శకత్వం ద్వారా మనసును ప్రశాంతత వైపు మళ్లించడం.
క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది. మెదడులోని ఆందోళన కలిగించే భాగం (అమిగ్డాలా) పనితీరును తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజూ ధ్యానం చేయడం వల్ల పనులపై దృష్టి పెట్టే సామర్థ్యం పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. నిద్రలేమి సమస్య తగ్గి, గాఢ నిద్ర పడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడి, అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. మైగ్రేన్, దీర్ఘకాలిక నొప్పులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. రోజులో కేవలం 10 నుండి 15 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని ధ్యానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ప్రక్రియ ఏదైనప్పటికీ ధ్యానం చేయడంలో శ్వాస క్రియ, మానసిక స్థితి ప్రధానం. ప్రశాంతమైన వాతావరణంలో సుఖాసనం లేదా వీలైన స్థితిలో కూర్చుని కళ్ళు మూసుకుని దీర్ఘంగా, నిలకడగా శ్వాస తీసుకుని వదలడం చేయాలి. వీలైనంత వరకు ఆలోచనలను పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అవసరమైతే లక్ష్య సాధన మార్గాలపై దృష్టి పెట్టవచ్చు. అలా మనసును మరల్చడాన్ని స్వీయ హిప్నాటిజం అంటారు. అలా ఆలోచిస్తూ మగత నిద్ర లాంటి స్థితిలోకి వెళ్లడాన్ని ధ్యాన నిద్ర లేదా ట్రాన్స్ అంటారు. ఏది ఏమైనా పది పదిహేను నిమిషాలు నిలకడగా శ్వాస తీసుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా పెరిగి, జీవరసాయన చర్యలు మెరుగు అవుతాయి. సానుకూల రసాయనాలు ఉత్పత్తి అవడం ద్వారా సానుకూల ఆలోచనలు కలుగుతాయి.

షట్ క్రియలు
యోగా, హఠ యోగా సంప్రదాయంలో శరీరాన్ని, మనస్సును అంతర్గతంగా శుద్ధి చేయడానికి ఉపయోగించే ఆరు ప్రాథమిక ప్రక్షాళన పద్ధతులను ‘షట్ క్రియలు’ (షట్కర్మలు) అంటారు. ఖిషటి అంటే ఆరు, ‘క్రియ’ అంటే అంతర్గత చర్య అని అర్థం. ఇవి వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేసి, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి.
ప్రధాన షట్ క్రియలు
- నేతి (నాసికా ప్రక్షాళన): నాసికా రంధ్రాలను, శ్వాసనాళాలను శుభ్రం చేయడానికి ఉప్పు నీటిని (జల నేతి) లేదా దారాన్ని (సూత్ర నేతి) ఉపయోగించే పద్ధతి.
- ధౌతి (జీర్ణాశయ శుద్ధి): నోటి
ద్వారా జీర్ణాశయం, అన్నవాహికలను శుభ్రపరిచే ప్రక్రియ. ఇందులో నీటిని తాగడం లేదా ప్రత్యేకమైన శుభ్రమైన గుడ్డను మింగి బయటకు తీయడం వంటివి ఉంటాయి. - నౌలీ (ఉదర కండరాల మసాజ్): ఉదర భాగాన్ని, పొట్టలోని అవయవాలను అటు ఇటూ తిప్పుతూ కండరాలను బలోపేతం చేసే పద్ధతి.
- బస్తీ (పెద్దపేగు ప్రక్షాళన): పాయువు ద్వారా నీటిని లోపలికి పీల్చి, పెద్దపేగును (colon) శుభ్రం చేసుకునే యోగిక్ ఎనిమా.
- కపాలభాతి (పుర్రె, శ్వాసకోశ శుద్ధి): వేగవంతమైన, బలవంతపు శ్వాసక్రియల ద్వారా ఊపిరితిత్తులను, నాడీ వ్యవస్థను, మెదడును శుద్ధి చేసే అభ్యాసం.
- త్రాటక (దృష్టి ఏకాగ్రత): రెప్ప వేయకుండా ఒకే బిందువును (ఉదా: కొవ్వొత్తి జ్వాల) స్థిరంగా చూస్తూ కంటి చూపును, ఏకాగ్రతను పెంపొందించుకునే ప్రక్రియ. వీటి ద్వారా అంతర్గత అవయవాలను నిర్విషీకరణ చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రాణాయామం, ధ్యానం చేయడానికి శరీరాన్ని, మనస్సును సిద్ధం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ క్రియలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి వీటిని నిపుణులైన యోగా గురువుల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకుని ఆచరించాలి.
యోగ దినోత్సవం
మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృషి వల్ల ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు వచ్చింది. ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోవటం గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా కమిషన్లో శాశ్వత సభ్యులుగా ఉన్న భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు ఆమోదం తెలిపారు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఈ తీర్మానం ఆమోదించబడింది. 2015 జూన్ 21న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.

జూన్ 21.. ఎందుకు?
జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి బలమైన కారణం ఉంది. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు జూన్ 21. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్స వంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also: