Schools reopening:బడులు మళ్లీ కళకళ. బాలల కళ్లు మిలమిల. వేసవి సెలవులు పూర్తయ్యాయి. తరగతులు తిరిగి మొదలయ్యాయి. ఇది కొత్తదేమీ కాదు. ఏటా ఉండేదే.. మనం చూస్తున్నదే. ప్రతీ సంవత్సరం ఈ సందర్భం మహోత్తుంగ తరంగం. ఎందుకంటే.. ఇలా జడిలో తడవడమే పిల్లలకు ఎంతో ఇష్టం! జూన్ పదిహేను.. ఈ తేదీ బడిబాలల మది రోజుల తరబడి సెలవులు గడిపి, బడిబాట పట్టడమన్నది వాళ్లందరికీ అదో ఇది! ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రందాకా బడి సందడి! మహాకవి గుర్తొస్తున్నారు. బాలల లోకాన్ని మన ముందుకు తెస్తున్నారు. “బాలలే విజ్ఞాన హేతువులు. నేడు రేపుల మధ్య సేతువులు చంద్ర బంధుర సుధా శీతువులు, మానవత్వ వికాస హేతువులు’. ఇది బాలల హాయనం. మంచికీ వాతాయనం, ఆనంద రసాయనం.. ఇదే నా ఉపాయనం” అని శ్రీశ్రీ అన్నట్లే అందరి అనుభవమూ అదే! జాతీయంగా, అంతర్జాతీయంగా బాలల దినోత్సవాలున్నాయి. బడుల దినోత్సవమంటూ ఒకటి ఉంటే తప్పకుండా అది ఇప్పుడే. విద్య, వైద్యం.. ఈ రెండింటి గురించీ ప్రతీ ఒక్కరు క్షేత్ర పర్యటనలూ సాగిస్తుంటాయి. బడిపిల్లలు ఏం కోరుకుంటారో తెలుసుకునేందుకు మాత్రం ఎవరికీ మనసు రాదు. అవును మరి.. ఆ పిల్లలు ఓటర్లు కాదుగా!
Read also: Organ donation: జీవితాన్ని వెలిగించే మహా ‘ప్రాణ’ దానం
తపన అంతా అందుకే..!

పిల్లల తల్లిదండ్రుల గురించే ప్రభుత్వాల ఆలోచనలన్నీ. ఆ పిల్లలకు మేలు చేసి, పెద్దల ఆదరాభిమానాల్ని ఇకముందూ పొందాలన్నదే తాపత్రయమంతా. నట్టనడుమ నిలిచి చూస్తుండేది పాపం బడిపిల్లలే! తాజాగా వార్తాకథనం ఒకటి వెలువడింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారినీ కదిపి కుదిపింది. కారణం- ఒక బడిబాలుడి కంటతడి! “బడి తెరిచారు.. రోజూ వెళ్లిరావాలి. వెళ్లేది ఎలా, తిరిగి ఇంటికి చేరేది ఇంకెలా? సారూ! మా ఊరికి సర్వీసు రోడ్డు లేదండీ? ఒక్క బస్సూ రావడం లేదండీ. నడిచి నడిచి వెళ్లటం, సాయంత్రానికి పడుతూ లేస్తూ తిరిగి రావడం. ఏం చేయాలి సార్!” అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు. మాట్లాడుతుంటారు. పాలకులు పదే పదే అదేపనిగా వల్లె వేస్తుంటారు. పాఠశాల విద్యకి సంబంధించి ఏ ప్రభుత్వమైనా ఇవ్వని హామీ ఉండదు. చేయని ప్రయోగమూ కనిపించదు. కళ్లు చూస్తుంటాయి. నోళ్లు మాట్లాడుతూనే ఉంటాయి. చేతులు సంతకాలు చేస్తుంటాయి. అయినా బడికి వెళ్లి వచ్చే క్రమంలోని సమస్య అతడిది. బడిలోపలి, బడి వెలుపలి సమస్యల మాటేమిటి? అనేకానేక పాఠశాలలకు కనీస వసతులు లేవు. ఎంతకీ రావు. మంచినీరు లేక, మరుగుదొడ్ల సదుపాయం ఉండక నానా అవస్థలు. గాలి, వెలుతురు సరిగా ఉండని తరగతి గదులు ఇంకొన్ని చోట్ల.
ప్రభుత్వాల తీరుతెన్నులు మారుతున్నందున, తరగతి గదుల సదుపాయాలు కొంత మెరుగై ఉండవచ్చు. బడి సమస్యలకు పరిష్కారాలూ ఎంతో కొంత లభించి ఉండనూ వచ్చు. మౌలిక వసతులకు కొరత ఇప్పటికీ కొన్నిచోట్ల వేధిస్తూనే ఉంది కదా! సమాచార, ప్రసార మాధ్యమాలు వాటిని బహిర్గతం చేస్తున్నాయి. వాటిల్లో కొన్నింటికి ప్రభుత్వ స్పందనలూ లభిస్తున్నాయి. కానీ, చీకటి వెలుగుల నడిమధ్యల బడిబాలల నోటిమాట ఎక్కడైనా వినవస్తోందా?
Schools reopening:పూర్వాపరాల పరంపరలు
ఉపాధ్యాయుల కొరత సరేసరి. అంతగా సమస్య లేదంటుంది విద్యాశాఖ. ఉన్న సమస్యను శాఖ చూడటం లేదంటూ మరోవంక నిరసన గళం మోగుతూనే ఉంటుంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు, అనంతర పనులతో ఉక్కిరి బిక్కిరవుతున్నట్లు కనిపిస్తుంటుంది శాఖ. అవును, కాదుల మధ్య బడుల అమ్మాయిలు, అబ్బాయిల మొరను వినిపించుకునేదెవరు? ఆర్చేదీ, తీర్చేదీ ఎవరు? ‘సర్కారు బడికి సమస్యల స్వాగతం’ అంటుంటే పూర్వాపరాలు ఇవీ అని వివరించే బాధ్యులు ఎక్కడున్నారు? విద్యాహక్కు చట్టం అంటూ ఒకటుంది. భారత రాజ్యాంగంలో చోటు చేసుకుంది. పిల్లలను రోజూ బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులది అంటోంది. చదువును అందించాల్సిన విధి ప్రభుత్వానిదే అనీ చెప్తోంది. నాణ్యతా ప్రమాణాల నిర్వహణను ఆదేశిస్తోంది/సూచిస్తోంది. అర్హత నిండిన బోధకులనే నియమించాలని, విద్యార్థి నిష్పత్తిని తప్పక పాటించాలని నిర్దేశిస్తోంది. పాఠశాలల ప్రగతి పనుల పర్యవేక్షణకు సంఘాల ఏర్పాటు జరగాలంటోంది. స్థానికంగా బడిబాలల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కమిటీలు పని చేయాలని చెప్తోంది. ఇవన్నీ అమలైతే, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే, పిల్లలు రోడ్డెక్కిన అవసరం ఎందుకు కలుగుతుంది? సమస్యలు తీర్చండని గ్రామస్థులు/పట్టణవాసులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని నిల్చునే స్థితి ఎందుకొస్తుంది? మధ్యాహ్న భోజనం సరిగా లేదని
నినదించాల్సిన అగత్యం ఎందుకని ఏర్పడుతుంది? నినాదాలు, ఆందోళనలు, బైఠాయింపులు, నిరసన ప్రదర్శనల్లో బడిపిల్లలు కనిపించడం ఏమిటి? ఆలోచన చేయాల్సింది పౌర సమాజమే. సమస్యల ఒడిలో చదువులు బడులు ఇంకా ఎన్నాళ్లు అన్నదే సమాధానం దొరకాల్సిన ప్రశ్న. మన ఊరు-మన బడి, గోరుముద్ద, ఇంకా ఎన్నెన్నో పేర్లు. కొన్ని పాతబడుతున్నాయి. ఇంకొన్ని సరికొత్తగా వచ్చి చేరుతున్నాయి.
చిత్తశుద్ధి-లక్ష్యసిద్ధి
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య. అంటే ఆ స్థాయిగల విద్యనే అందిస్తామన్నది ఇంకొక వాగ్దానం. స్కూళ్ల పునఃప్రారంభ తేదీ నుంచే ఇదీ వినవస్తుంటుంది. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పిస్తామంటూ పథకాలు రచిస్తున్నారు. ఆచరణ పనులు కొనసాగిస్తున్నారు. బడిబాట అనేది అనడానికి, వినడానికి ఇంపుగా ఉంటుంది. వాస్తవానికి ఏం జరుగుతోందన్నది మన కంటికి కనిపిస్తూనే ఉంది. బడి అంటే అమ్మబడి.. కనుకనే ఏ బిడ్డా ఆకలితో ఉండకూడదని ప్రభుత్వాలు అంటున్నాయి. పోషకాహారం అందించడాన్ని స్కూలు పునఃప్రారంభం నుంచే అమలులోకి తెస్తున్నాయి. ఈ చిత్తశుద్ధి కొనసాగినంతవరకు కావాల్సింది అదే. అప్పుడే లక్ష్యసిద్ధి సుసాధ్యమవుతుంది.
చిన్నపిల్లల పెద్దభావాలు

సెలవు అంటే ఆటవిడుపు. రోజువారీ పనుల నుంచి విరామం. అనుకూలం అనే పర్యాయపదమూ ఉంది. దేనికి అనుకూలత? విశ్రాంతికి! ఉపయోగం అనే మరో భావమూ సెలవుకు వర్తిస్తుంది. ఏ ఉపయోగం? అప్పటివరకు పెండింగులో ఉంచినవాటిని సెలవురోజుల్లో పూర్తి చేసుకోవటం అన్నమాట. అంతదాకా చదువులో తలమునకలైన పిల్లలు ఆటలు, ఇతర అభిరుచుల వైపు చూపు మళ్లిస్తారు. బోధనలో నిమగ్నమై ఉండిన ఉపాధ్యాయులు తదితర అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. నిత్యం, నిరంతరం బోధనేతర బాధ్యతలు నిర్వర్తించే సంబంధిత సిబ్బంది ఎండాకాలం సెలవుల్లో హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. సమావేశాలూ దైనందిన పాలనా విధులతో సతమతమయ్యే విద్యాశాఖ అధికారులు ఇతరేతర పనుల్లో లీనమవుతారు. బాలల తల్లిదండ్రులు సరేసరి. హాలిడేస్ ను జాలీడేస్ గా భావించి ఆటపాటల్లో మునిగి వుండే సంతానాన్ని కళలు, ప్రయాణాల దిశకు తిప్పాలని తహతహలాడుతుంటారు. అందరికన్నా మిన్నగా సెలవులను ఆస్వాదించేది మాత్రం నిస్సందేహంగా విద్యార్థినీ విద్యార్థులే. “ఆడుకో, పాడుకో” అనేలా వాటిల్లోనే రోజులు గడిపేస్తారు. సెలవులన్నీ ముగిసి, తిరిగి బడికి వెళ్లాల్సి వచ్చినపుడు పిల్లల భావోద్వేగాన్ని చూసి తీరాల్సిందే!
ఈ ప్రశ్నలకు సమాధానాలేవి?
“సెలవులు ఎందుకిస్తారు?” స్కూల్ తెరిచారు కదా! మరిప్పుడు దీన్ని ఫస్ట్ డే అనాలా? సెలవులకు లాస్ట్ డే అనాలా? ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కి వచ్చాను. ఇప్పుడే ఈ ఏడాదే పుస్తకాలు మారాయంటున్నారు. ఎందుకు టీచర్? కొత్త పిల్లలు వస్తారంటున్నారు. ఇన్ని రోజులు వాళ్లెందుకు చదువుకోలేదు సార్? మీరు చేర్చుకోలేదు ఎందుకనీ? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు కొందరు పిల్లల నుంచి వినవస్తాయి. లోపల అనుకున్నా, పైకే అడిగినా వాటికి బదులివ్వాల్సింది ఉపాధ్యాయులే! స్కూలుకు వచ్చేది చదువుకోడానికి. సెలవులిచ్చేది ఆడుకోడానికి. “చదువులూ, ఆటలూ రెండూ కావాలంటే ఎలా?” అని ఏ పిల్లో, పిల్లవాడో అడిగితే వచ్చే సమాధానమేమిటో? ఇంట్లో, బయటా, బడిలో కూడా ఏవేవో అడుగుతూనే ఉంటారు. బాలలు. వచ్చిన జవాబునే నచ్చేలా చేసుకుంటారు. “పాఠం విన్నారు. కదూ, ఏదైనా తెలియకపోతే అడగండి. ఎన్ని సార్లయినా సరే, మీరు బాగా తెలుసుకునేలా చెప్తా” అంటుంటారు టీచర్లు. ఇటువంటి కొన్ని ప్రశ్నలకు మాత్రం వారేం చెప్పగలరు? ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్న వేయడం అనేది బాలబాలికల హక్కు. బదులివ్వడమన్నది ఉపాధ్యాయుల బాధ్యత. అంతకుమించి వృత్తి ధర్మం. ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ అవుతున్నా, ఒక్క ప్రశ్నకు మటుకు సూటి సమాధానం నేటికీ లేదు, రాలేదు.
సెలవులు ఎందుకిస్తారు?
అవును.., ఏటా ఎందుకిస్తున్నట్లు! ఎప్పటికప్పుడు.. ఎక్కడికక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేసవి సెలవుల షెడ్యూలు దాదాపు ఒకేలా ఉంది. ఏప్రిల్ మూడో వారం తర్వాత మొదలైన సమ్మర్ హాలిడేస్ మే నెల చివరిదాకా కొనసాగాయి. జూన్: రెండో వారందాకా విస్తరించాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే సెలవులు పొడిగింపు కూడా. బడులు తిరిగి మొదలైనా మరికొన్ని చోట్ల సందర్భానుసారం వరస సెలవులు సైతం. మొత్తంమీద రమారమి రెండు నెలలు. జూన్ నెల పరంగా సగం రోజులు సెలవుల్లో గడిచినట్లే!
దేశ రాజధాని నగరంలో జులై మొదటి నుంచి బడుల పునః ప్రారంభం.
ఉత్తరప్రదేశ్‌లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే. రాజస్థాన్‌లో సెలవులు జూన్ మూడో వారందాకా. బీహార్, హరియాణా ప్రాంతాల్లో వాతావరణ మార్పు, చేర్పుల ఆధారంగా రూపొందుతాయి సెలవుల అధికారిక ప్రకటనలు. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక స్థితిగతుల వల్ల వేసవి సెలవులను నిర్ధారించారు. వేడిమి తీవ్రత, ఉక్కపోత కారణంగా పిన్నలూ, పెద్దలూ ఇబ్బందుల పాలవకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దశల వారీగా వేసవి సెలవులను ప్రకటించే విధానం పంజాబ్‌లో అమలవుతోంది. స్థానికం, జిల్లా అధికార యంత్రాంగాలు ఆ మేరకు చర్యలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమిళనాడులోనూ తమదైన పద్ధతిని విద్యాశాఖ అనుసరిస్తోంది. సెలవుల సంబంధంగా ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ఇలా దేశంలోని పలు రాష్ట్రాలు పాఠశాలలకు సెలవుల ప్రకటన, పునఃప్రారంభ రీతులను పాటిస్తున్నాయి.
పుస్తకాలకే తొలి ప్రాధాన్యత
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత తిరిగి తెరుచుకోగానే? అధికారులు మొట్టమొదట ప్రాముఖ్యమిచ్చేది పాఠ్య, నోటు పుస్తకాల పూర్తి సరఫరా లక్ష్యానికే. ప్రభుత్వ, ప్రైవేటు బడులు విద్యా సంవత్సర ఆరంభంలో కళకళ. ప్రత్యేకించి సర్కారు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ ఉచితంగానే. అందువల్లనే సంబంధిత విద్యాశాఖ యంత్రాంగాలు ఇప్పటికే జిల్లా కేంద్రాల పైన దృష్టి సారించాయి. మండలాల వారీగా రవాణాకు ఏర్పాట్లన్నీ చేశాయి.
బడుల ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తున్నారు. పదో తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ పుస్తకాలు అందించే కర్తవ్యాన్ని చేపడుతున్నారు. ఏ దశలో ఎటువంటి సమస్య ఎదురైనా గమనించి, పరిశీలించి, పరిష్కరించడానికి పలువురిని బాధ్యులుగా చేస్తున్నారు. వివరాలను ముందుగానే ప్రకటిస్తున్నారు. విద్యా వత్సర ప్రారంభతరుణంలోనే పాఠ్య, రాత పుస్తకాలు అందిస్తున్నామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికీ ప్రకటించాయి. పంపిణీ పరంగా గతంలో ఆలస్యం జరిగినందున, ఈసారి అటువంటి ఇబ్బందులు తిరిగి ఏర్పడకుండా చూసుకుంటున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో, వాటిల్లో ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుతున్నారో గణాంక వివరాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు ఎంత మందికి అందాయో, ఈ ఏడాది ఎందరికి అందుతాయో లెక్కలు చెప్తున్నాయి.
ఏకరూప దుస్తుల గురించీ..
బాలురకు, బాలికలకు బడిదుస్తులు సరఫరా చేయడమన్నదీ ప్రభుత్వాల లక్ష్యం. ముందుగా ఒక జతను ఒక్కొక్కరికీ అందించి, అటు తర్వాత రెండో జత యూనిఫాము ఆగస్టులోగా అందించాలని భావిస్తున్నారు. ఇలా ఏకరూప దుస్తుల తయారీకి కొలతలు తీసుకోవడం, తదుపరి పనులు చేయడాన్ని మహిళా సమాఖ్య సంఘాలకు అప్పగించారు. పర్యవేక్షణ సాగిస్తున్నారు. పుస్తకాలనీ, స్కూలు డ్రస్సి ప్రత్యేక వాహనాలతో తరలించే పని ఇంకా జరగాల్సి ఉంటుంది. అది ఎక్కడ ఎంత శాతం పూర్తయిందో తెలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామంటున్నారు ఉన్నత స్థాయి అధికారులు. రాష్ట్రంలోని ఏ జిల్లాకు ఎన్ని కావాలి, ఇప్పటికి వచ్చినవి, రావాల్సినవి ఎన్నెన్ని అని ఆరాలు తీస్తున్నారు. రావాల్సి వున్నవాటి కోసం ఎదురుచూసే పరిస్థితులు ఉండకూడదు. మాకు అందనేలేదన్న ఫిర్యాదులు ఎక్కడా వినిపించరాదన్నది విద్యాశాఖ అభిమతం. అదొక్కటీ ఉంటే సరిపోదు. “ఆలోచన, ఆచరణ మధ్య పొంతన అంటూ తప్పనిసరి..” ఇదీ ఉపాధ్యాయ సంఘాల వాణి. ఎవరి స్థాయిలో వారు నిబద్ధతగా పని చేస్తే పిల్లల ఆశలన్నింటినీ నెరవేరినట్లే! విద్యార్థినీ విద్యార్థులకు కావాల్సిన వాటిని బడులు తెరిచిన తదుపరి కాదు; ముందే అందిస్తామని గంభీర ప్రకటనలు చేశాయి ప్రభుత్వాలెన్నో. ఆ వాగ్దానాలు ఆచరణ రూపానికి ఏ మేరకు వచ్చాయన్నది పిల్లల తల్లిదండ్రులకైతే మరింత బాగా తెలుస్తుంది.

పాఠశాల అంటే!
స్కూలు అంటే కేవలం భవనం కాదు. తరగతి గది అనేది గోడలకు పరిమితం అసలే కాదు, అస్సలు కాకూడదు. అమ్మఒడి ఎంతో, నాన్న కౌగిలి ఎంతో, బడి కూడా అంతే! బడి, బడి. పిల్లలకు కావాల్సిందీ వాళ్లు కోరుకునేదీ ఇవే! పాఠశాల.. పిల్లల పాలిట సర్వం, సకలం, సమస్తం. తోటి బాలలతో స్నేహం, గురువులంటే వినయం. వీటికి మూలం, కీలకం తరగతి గదీ. దీనిలోనే అన్ని ఆశలూ, ఆశయాలూ, చిన్ని చిన్ని అనుభవాలూ నేర్చుకున్న వాటినే ఇంటికెళ్లి అమ్మా నాన్నతో పంచుకుంటారు. ఇంట్లో, బడిలో వాతావరణం ఎంత బాగుంటే, బాలబాలికల జీవితమూ అంత బాగా పరిమళిస్తుంది. కాబట్టే, చూపులన్నీ బడివైపు ఎప్పుడూ. బాలల తలరాతలు మార్చేది తరగతి గదే అంటారు. ఆ చిట్టి శిలలను చక్కటి శిల్పాలుగా మలచేది పాఠాలు చెప్పే గురువులే! అంతటి కృతజ్ఞతా 7 భావంతోనే శిష్యులు ఎంతటి ఉన్నత స్థాయికి చేరినా ఏరికోరి మరీ గురు బ్రహ్మల దరిచేరి తల వంచి నమస్కరిస్తారు. పాదాలకు మొక్కి, దీవెనలు అందుకుంటారు మనసారా. కలయో, పుస్తకమో మార్పు తెచ్చినట్లు ఉపాధ్యాయ స్వరమూ మంచిని ప్రసరిస్తుంది.. ప్రవహింపచేస్తుంది. గురువులు మార్చిన బడులూ ఎన్నో ఉన్నాయి. వివిధ కారణాలతో చేరికలు తగ్గిన విద్యార్థుల శాతాన్ని స్వయంకృషితో పెంచిన వారున్నారు. సొంత డబ్బులతో పాఠశాల నిర్మాణ, నిర్వహణ పనులకు తోడూ, నీడగా నిలిచినవారూ ఎందరో ఉన్నారు. ఉదహరించాలేగానీ ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లోనూ అనేకం.
అక్షర శక్తి
అక్షరమే లోకానికి రక్షణ, పరిపోషణ ‘అక్షరశాల’ బాలలకు వరం ఈ బడిలో గంట, తరగతిలో బల్ల! చదువుల తోటలో సీతాకోకచిలుకలు పిల్లలు వెలుగుపూలను పంచే తెలుగు తేజాలు!
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: