హృదయ కాలేయం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్‌గా అందరి హృదయాలను గెలచుకున్నాడు సంపూర్ణేష్ బాబు.ఈ చిత్రం సంపూకి సూపర్ హిట్‌ని అందించింది. అయితే చాలా రోజుల తర్వాత సోదరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంపూ ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా కీలక పాత్రలో నటించాడు. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా నటించగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించాడు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చంద్ర చగంలా నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
స్టోరీ
తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరులో జరిగే అన్నదమ్ముల కథ ఇది. చిరంజీవి (సంపూర్ణేష్ బాబు), పవన్ (సంజోష్) ఇద్దరు అన్నదమ్ములు, ఒకరంటే ఒకరికి ప్రాణం. చిరంజీవి తన కుటుంబంతో కలిసి సోడా వ్యాపారం చేస్తుంటాడు. అయితే, వయసు పెరిగినా చిరంజీవికి పెళ్లి కాకపోవడం వల్ల కుటుంబంతో పాటు అతడు ఆందోళన చెందుతుంటాడు. అదే సమయంలో పక్కింట్లోకి దివి (ఆర్తి గుప్తా) అనే అమ్మాయి తన కుటుంబంతో దిగుతుంది. ఇక దివిని చూసిన వెంటనే ఇద్దరు సోదరులు ప్రేమలో పడిపోతారు. అయితే తమ్ముడు పవన్ కూడా దివిని ఇష్టపడుతుండటంతో, చిరంజీవి అతడిని పోటీ నుంచి తప్పించేందుకు చదువు కోసం వేరే ఊరికి పంపిస్తాడు. అనంతరం చిరంజీవి దివికి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు, కానీ దివి చిరు ప్రపోజల్‌ని తిరస్కరిస్తుంది.మరోవైపు చదువు కోసం వేరే ఊరుకి వెళ్లిన పవన్ తన కాలేజీలో భువి (ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు. కాలేజీ అనంతరం సెలవుల్లో ఇంటికి వచ్చిన పవన్‌కు చిరంజీవిని దివి రిజెక్ట్ చేసిన విషయం తెలుస్తుంది. మా అన్ననే రిజెక్ట్ చేస్తాదా అని చిరంజీవిని రెచ్చగొట్టి అర్ధరాత్రి దివి ఇంటికి వెళ్లేలా చేస్తాడు. అయితే చిరంజీవి రావడం దివి తండ్రి చూడటంతో పెద్ద గొడవ అయి రెండు కుటుంబాలు కొట్టుకునే దాకా వెళ్తారు. దీంతో దివి కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోతుంది. తమ్ముడి వలనే ఇలా జరిగిందని చిరంజీవి అనుకోవడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ఏం జరిగింది. చిరంజీవి పవన్ మళ్లీ కలుస్తారా దివి తిరిగి వస్తుందా? చిరంజీవికి పెళ్లి అవుతుందా? పవన్-భువి ప్రేమ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రావడంతో సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సంపూర్ణేష్ బాబు తన విలక్షణమైన కామెడీ పాత్రలకు భిన్నంగా “సోదరా” చిత్రంలో భావోద్వేగాలతో కూడిన పాత్రలో మెప్పించాడు. సాధారణ కథాంశంతో మొదలైనప్పటికీ, దర్శకుడు మోహన్ తన క్రియేటివిటీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కథలోకి లీనమయ్యేలా చేశాడు. మొదటి భాగంలో పాత్రల పరిచయం, వారి కుటుంబ నేపథ్యం, అలాగే సాగే కళాశాల ప్రేమకథ ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చాయి. ముఖ్యంగా కళాశాల సన్నివేశాల్లోని హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.విరామ సమయానికి చేరుకునేసరికి కథ మంచి మలుపు తిరుగుతుంది, ఇది రెండవ భాగంపై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం, వారి మధ్య సంఘర్షణ హృద్యంగా చూపించారు. ఇక ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు చిత్రం మరింత ఉత్కంఠభరితంగా మారి ప్రేక్షకులను కట్టిపడేసింది.