తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గద్దర్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరగబోతోంది. ఈ మేరకు అడుగులు పడ్డాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి, జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ, జ్యూరీ మెంబర్లు అంతా మీడియా ముందుకు వచ్చారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఈ మేరకు మాట్లాడుతూ గద్దర్ అవార్డుల్ని జూన్ 14న ప్రధానం చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ప్రపంచ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్ ఏ తీరుగా నిర్వహిస్తారో అందుకు ఏమాత్రం తగ్గకుండా గద్దర్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఈ అవార్డ్ వేడుక గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ఈవెంట్ నిర్వహించాలని కమిటీ సభ్యులకి, అధికారులకి భట్టి విక్రమార్క సూచించారు. సినిమా అవార్డుల ఫంక్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పుట్టడం మన అదృష్టం అని, దశాబ్దానికి ఒకరు అలాంటి మహానుభావులు పుడతారని కొనియాడారు భట్టి విక్రమార్క.
తెలంగాణ
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆయన మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఊపిరి పోశారు కాబట్టి ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమే. బంధాలు, రాగద్వేషాలకు అతీతంగా గద్దర్ సినీ అవార్డులకు సినిమాలను ఎంపిక చేయాలని జూరీ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.త్వరలోనే సీఎం చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ చేయనున్నారు. ఇక గద్దర్ సినీ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు కాగా, కమిటీకి ఛైర్మన్‌గా నటి జయసుధను ఎంపిక చేశారు. అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత విభాగంలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, చిల్డ్రన్ ఫిల్మ్స్, పుస్తకాలు ఇతర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందినట్టు తెలియజేశారు.

హెచ్ఐసీసీ
2024లో విడుదలైన చిత్రాల్ని జ్యూరీ మెంబర్లు చూసి షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్పారు. అందులోంచి మంచి చిత్రాలకు గద్దర్ అవార్డుల్ని ప్రకటిస్తామని దిల్ రాజు తెలిపారు. హెచ్ఐసీసీ వేదికగా అవార్డుల్ని ప్రకటిస్తారట. ఇక ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే సినీ పరిశ్రమకు ప్రోత్సాహం లభించిందని అన్నారు. గత పదేళ్లుగా సినిమా పరిశ్రమను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.