తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం, శనివారం రోజుల్లో వడగండ్ల వాన పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు.కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు గురువారం పిడుగుపాటుకు గురై రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల మరణించారు.జనగామ జిల్లా లింగాలగణపురం మండలం నేలపోగులలో మందాడి రవీందర్ రెడ్డి అనే రైతు పిడుగు పడి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్‌లో సంతోష్ అనే విద్యార్థి పిడుగుపాటుతో మరణించాడు. కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోష్ అనే విద్యార్థి కూడా పిడుగుపాటుతో మృతి చెందాడు.
ఉష్ణోగ్రతల్లో మార్పులు
ఏప్రిల్ 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజుల్లో ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. అయితే ఆదివారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండనున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.నిన్న ఏపీలో ఉష్ణోగ్రతల విషయానికొస్తే ప్రకాశం జిల్లా నందనమారేళ్లలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తిరుపతిలోని వెంకటగిరిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు, కడపజిల్లా ఒంటిమిట్టలో 41 డిగ్రీలు, నంద్యాలజిల్లా దొర్నిపాడులో 40.8 డిగ్రీలు, విజయనగరం జిల్లా ధర్మవరంలో – 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జాగ్రత్తలు
ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తక్షణమే వాతావరణ సమాచారం పై అప్రమత్తంగా ఉండాలి.వడగండ్ల వాన సమయంలో చెట్ల క్రింద నిలవకూడదు.విద్యుత్ తీగలు, కరెంట్ పోల్‌లకు దగ్గరగా ఉండరాదు.ఒకవైపు ఎండాకాలం మరోవైపు వానాకాలం ఒకవైపు మండేఎండలు మరోవైపు వానలు.తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఏర్పడింది. ఉదయం ఉక్కపోతతో రాత్రి వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: BRS Public Meeting: సభ అనుమతులపై హైకోర్టుకు బిఆర్ఎస్