Bengal Assembly Elections : బంగాల్లో రాష్ట్రపతి పాలనలలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముర్షిదాబాద్‌లో జరిగిన హింసతో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆరోపించారు. ముర్షిరాబాద్తో పాటు సుతి, ధులియన్, జాంగిపుర్, శంషెర్గంజ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింస నేపథ్యంలో పౌరులను కాపాడటం, శాంతి నెలకొల్పడంలో ప్రభుత్వం వైఫల్యమైందన్నారు. అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుంటే అధికార పక్షం మౌనం వహిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అందుకే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన
ఇటీవల బంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక జిహాదిస్టులు ఉన్నారని సువేందు సంచలన ఆరోపణలు చేశారు. “ఉన్మాదంగా ప్రవర్తించడానికి కొన్ని గ్రూపులను ప్రభుత్వం అనుమతిస్తోంది. కానీ మేము వాటిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అందుకే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయడం గురించి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి” అని సువేందు అధికారి అన్నారు.
ఈ ఘర్షణల్లో కాలిపోయిన ఇళ్లు, దుకాణ సముదాయాలు, హోటళ్లు
బంగాల్లో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో ఇళ్లు, దుకాణ సముదాయాలు, హోటళ్లు కాలిపోయాయి. ఈ హింసాకాండతో వందలాది మంది భగీరథి నదిని దాటి పక్కన ఉన్న మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందారని అధికారులు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు స్థానిక యంత్రాంగం ఆశ్రయం, ఆహారాన్ని అందించిందన్నారు. వారికి పాఠశాలల్లో వసతి కల్పించిందని తెలిపారు. పడవల ద్వారా వచ్చే వారికి సహాయం చేయడానికి వలంటీర్ టీమ్‌లను ప్రభుత్వం యంత్రాంగం ఏర్పాటు చేసింది.
Read Also: గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన భారీగా డ్రగ్స్ సీజ్