వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి,రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ పేరుతో ఒక నూతన అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకుని ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్నారని విమర్శించారు. “మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం(Red Book Constitution) ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది అని ఎన్నికలకు ముందే ప్రకటించారు. అదేదో మాటలకే పరిమితం అనుకున్నాం, కానీ ఇప్పుడు దాని పర్యవసానాలు చూస్తున్నాం,” అని సజ్జల అన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల నమోదు చేసిన కేసు ఈ కోవలోకే వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆవేదన
ఏదైనా కేసులో ఆధారాలుంటే ఎంతవరకైనా వెళ్లవచ్చని, కానీ ఏమీ లేకుండా కల్పిత కథలు సృష్టించి, పాత్రలను తయారుచేసి, వాటిని తమ అనుకూల మీడియాలో రోజుల తరబడి ప్రచారం చేసి, ఆ తర్వాత వ్యక్తులను అరెస్టు చేసి కన్ఫెషన్లు రాయించుకుంటున్నారని సజ్జల(Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు.”పదేళ్ల క్రితం నాటి సంఘటనలను కూడా ఇప్పుడు తవ్వి తీసి, విష ప్రచారంతో ప్రజల మెదళ్లలోకి ఎక్కించి, కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. ఇది సోషల్ మీడియా కార్యకర్తలతో మొదలై, నాయకుల వరకు పాకింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు
ఈ విధమైన అణచివేత చర్యల వల్ల నాయకులు, కార్యకర్తలు మరింత గట్టిగా తయారై వస్తున్నారని, వైఎస్ఆర్సీపీ(YSRCP) మరింత బలపడుతుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. “ఒక నెల, రెండు నెలలు నాయకులను జైల్లో పెట్టొచ్చు. కానీ వారు బయటకు వచ్చేసరికి మరింత దృఢంగా మారుతున్నారు” అని తెలిపారు. పోలీసు వ్యవస్థ ఒకసారి గాడి తప్పితే, దానిని మళ్లీ దారికి తీసుకురావడం చాలా కష్టమని, ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అన్నారు. తెనాలి(Tenali)లో జరిగిన ఘటనను, కావలి ప్రాంతంలో బహిరంగంగా అసభ్య నృత్యాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని ఆయన ఉదహరించారు. “ఖాకీ డ్రెస్సులో గూండాయిజం కళ్ళ ముందు కనపడుతుంది.అధికారులు కొందరు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు,” అని సజ్జల దుయ్యబట్టారు.
Read Also: AP DSC: ఇంటర్నెట్ లో డీఎస్సీ హాల్‌టికెట్లు అందుబాటు