ఆంధ్రప్రదేశ్‌లో పంట పొలాలు, జనావాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా, గజరాజుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమికొట్ట గలిగే కుంకీ ఏనుగులు రానున్నాయి. ఇవాళ ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులను అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) చేతుల మీదుగా వీటి అప్పగింత కార్యక్రమం జరిగింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే సమక్షంలో ఈ ఆరు కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.గజరాజులు చేస్తున్న పంటపొలాల ధ్వంసాన్ని ఇవి కట్టడి చేయనున్నాయి.కుంకీ ఏనుగుల అప్పగింత ఒప్పందం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఓ కీలక ముందడుగని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) అన్నారు. వీటిని ఇచ్చిన కర్ణాటకకు కృతజ్ఞతలని తెలిపారు. ఏపీ ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ముందుకొస్తుందని ప్రశసించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాక్షించారు. అడవులు, పర్యావరణం అంశాల్లో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఏపీలో కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

గజరాజుల
కుంకీ ఏనుగుల రక్షణను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. కుంకీ ఏనుగులు కావాలని స్థానిక ప్రజలు 21 సంవత్సరాలుగా అడుగుతున్నారని చెప్పారు. స్థానిక గజరాజుల వల్ల గ్రామాలు, పంటలు ధ్వంసం కాకుండా కుంకీ ఏనుగులు రక్షిస్తాయని పవన్ పేర్కొన్నారు.జనావాసాల్లోకి వచ్చేసి పెద్ద ఎత్తున పంటల విధ్వంసం, ప్రాణ, ఆస్తినష్టం కలిగిస్తున్న ఏనుగుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమికొట్ట గలిగేవి కుంకీ ఏనుగులు. ప్రత్యేకంగా శిక్షణ పొందినవాటిని కుంకీ ఏనుగులుగా పరిగణిస్తారు. అటవీ ఏనుగులను మచ్చిక చేసుకోవడం, తరిమేయడం,వాటిని శాంతింపజేయడం ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడే కుంకీ ఏనుగులను పట్టుకోవడం మొదలు వాటి శిక్షణ, ఆపరేషన్లలో వినియోగం వరకూ ప్రతి దశ ఆసక్తికరమే.అడవిలో తిరిగే గజరాజుల గుంపు నుంచి వేరుపడి ఒంటరైన, కొన్ని ప్రత్యేక లక్షణాలున్న ఏనుగులను గుర్తించి వాటిని బంధిస్తారు. ఇందుకోసం తక్కువ వయసున్న, మగ ఏనుగులనే ఎంపిక చేసుకుంటారు. ఇటీవల కేరళలో ఒక ఆడ ఏనుగునూ కుంకీగా మార్చారు. పట్టుకున్నవాటికి శిక్షణ అందిస్తారు. వాటిని గుర్తించేందుకు ప్రత్యేక పేర్లు పెడతారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక,రాష్ట్రాల్లో కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాలున్నాయి.
Read Also: Narendra Modi: మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనిత