ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు సకల దేవతలకు ఆహ్వనం పలుకుతూ. దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రం, నల్లమల గిరులు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వేలాదిమంది శివమాలధారులు, సాధారణ భక్తులు మల్లన్న క్షేత్రానికి వస్తున్నారు. కొందరు భక్తులు కాలి నడకన అటవీ మార్గంలో సన్నిధికి పాదయాత్రగా వెళ్తున్నారు. ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఉత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాలను, మండపాలను రంగుల విద్యుద్దీపాలతో ముస్తాబయ్యాయి. అలాగే శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచానాలతో క్యూలైన్లలో అల్పాహారం, పాలు, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైలంకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ సిద్ధం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు, పాదయాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఉచిత దర్శనం,రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లను భక్తులకు అందుబాటులో ఉంచారు. ఈ విధంగా భక్తులు తమ సౌకర్యాన్ని అనుసరించుకుని దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, దర్శన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు అధిక సంఖ్యలో సిబ్బందిని విధుల్లో ఉంచారు.
ఫిబ్రవరి 23 వరకు దర్శనం సౌకర్యం
అదనంగా, జ్యోతిర్లింగ దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 23వ తేదీ వరకు చంద్రావతి కల్యాణ మండపం వద్ద నుంచి మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం నిర్వహించనున్నారు.భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీశైలం విచ్చేసే ప్రముఖులకు ప్రత్యేకంగా నాలుగు విడతలుగా బ్రేక్ దర్శనాన్ని కల్పించనున్నారు. దీంతో భక్తుల రద్దీ సమయంలో కూడా ప్రముఖులకు సులభంగా స్వామివారి దర్శనం చేసుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు.
భద్రత – సీసీ కెమెరాలతో పటిష్ఠ బందోబస్తు
భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా ఆలయం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు.