విజయవాడ : (AP) రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (S. Savitha) తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అందిస్తున్న సేవలు అద్వితీయమని కొనియాడారు. 2025 26 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయడంపై ఆ బోర్డు అధికారులను మంత్రి అభినందించారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియాతో కలిసి ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అధికారులతో మంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపాధి కల్పనా వివరాలను ఆ బోర్డు సీఈవో సింహాచలం వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,060 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా, టార్గెట్ కు మించి 3,744 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.127.17 కోట్లు సబ్సిడీ రూపంలో అందజేశామని, దీనివల్ల 41,184 మందికి ఉపాధి లభించిందని సీఈవో సింహాచలం తెలిపారు.
Read Also: AP: లిక్కర్ స్కామ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి

యువతకు ఉపాధి అవకాశాలు అందించడం ప్రభుత్వ లక్ష్యం
అనంతరం(AP) మంత్రి సవిత మాట్లాడుతూ, 202526 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయడంపై ఆ బోర్డు అధికారులను మంత్రి అభినందించారు. 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంమన్నారు. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా వలసల నివారణే ప్రభుత్వ లక్ష ్యమన్నారు. ప్రజల అవసరాలు, డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని యూనిట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఆన్ లైన్లో యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని, అర్హులందరికీ యూనిట్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
శిక్షణ ద్వారా స్వయం ఉపాధి ప్రోత్సాహం
టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్కులు, కొవ్వొత్తులు, ఆకులతో కప్పులు, ప్లేట్ల తయారీపై కూడా శిక్షణ అందజేస్తూ యూనిట్లు మంజూరు చేస్తున్నామన్నారు. రూ.10 లక్షల వరకూ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరింత యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని, ఇందుకోసం గ్రామీణ స్థాయిలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా అందజేసే యూనిట్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. నియోజక వర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలతోనూ, బోర్డు చైర్మన్, డైరెక్టర్లతోనూ సమన్వయం చేసుకుంటూ యూనిట్లను స్థాపించాలని సూచించారు.
దీనివల్ల మరింత యువతకు ఉపాధి అందించే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం యూనిట్లు స్థాపించిన వారితో పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ స్థాయి సమావేశం నిర్వహిద్దామన్నారు. యువతకు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధిపై ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుఅధికారులపై ఉంద న్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ కె. కె. చౌదరి, డైరెక్టర్లు, సీఈవో సింహాచలం, వివిధ జిల్లాల ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: