हिन्दी | Epaper

Andhra Pradesh: ఈరోజు ,రేపు ఏపీలో భారీ వర్షాలు

Sharanya
Andhra Pradesh: ఈరోజు ,రేపు ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణం రానున్న రెండు రోజుల పాటు గణనీయంగా మారనున్నది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం అనిశ్చితంగా మారుతూ మంగళవారం (మే 7) మరియు బుధవారం (మే 8) రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాలు:

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

ఈదురు గాలులు – భద్రత చర్యలు:
వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పరిస్థితిలో, విద్యుత్ తీగలకూ, బోర్డులకూ దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. చిన్న పెద్ద చెట్లు, గోడల పక్కన నిల్చోవద్దని హెచ్చరిస్తున్నారు.

తేలికపాటి జల్లులు పడే అవకాశమున్న జిల్లాలు:

ఇక విశాఖపట్నం, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు, నిన్న రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీలు, వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Read also: DSC : మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870