ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాముఖ్యతనిస్తూ, వారి ఆర్థిక స్వావలంబన కోసం పలు కార్యాచరణలతో ముందడుగు వేస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకు మహిళలు తమ జీవితాలను అభివృద్ధి చేసుకునేందుకు కావలసిన అన్ని అవకాశాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు (Self Help Groups- SHGs), బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి వంటి పథకాల ద్వారా మహిళలు స్వావలంబులు అవుతున్నారు.మరోవైపు పట్టణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించేందుకు 2007లో మెప్మాను స్థాపించారు. MEPMA (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్) పేరుతో పట్టణ ప్రాంతాల్లోని మహిళల సాధికారత కోసం మెప్మా ఏర్పాటు చేశారు. మెప్మాలో రిసోర్స్ పర్సన్స్ చాలా కీలకంగా ఉంటారు.ఈ నేపథ్యంలోనే మెప్మాలోని రిసోర్స్ పర్సన్స్‌కు ఏపీ ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేస్తోంది.
మెప్మా రిసోర్స్ పర్సన్స్‌కు ట్యాబ్‌లు అందిస్తున్నామని
విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలలోని మెప్మా రిసోర్స్ పర్సన్స్‌కు శనివారం ట్యాబ్‌లు పంపిణి చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేశినేని చిన్ని, మెప్మా, డ్వాక్రా, సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మానస పుత్రికలు అని అభివర్ణించారు. మెప్మా రిసోర్స్ పర్సన్స్‌కు ట్యాబ్‌లు అందిస్తున్నామని, అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ మెప్మా, డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.అటు అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చేతుల మీదుగా మెప్మా రిసోర్స్ పర్సన్స్, డిజి లక్ష్మిలకు ట్యాబ్‌లు, బయోమెట్రిక్ డివైజ్‌లు అందజేశారు. నూతన టెక్నాలజీ ద్వారా మెప్మా రిసోర్స్ పర్సన్లు , డిజి లక్ష్మిలు ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరారు.

స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు సాంకేతికతను చేరువ చేసేందుకు
మెప్మా రిసోర్స్ పర్సన్స్ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బుక్ కీపింగ్, ఇతర నైపుణ్య శిక్షణలను అందిస్తారు. బ్యాంకు లింకేజీల ద్వారా రుణం మంజూరయ్యేలా చూడటం, సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం వీరి పని. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయటంలోనూ రిసోర్స్ పర్సన్స్ (Resource Persons) సాయపడుతుంటారు. ఈ నేపథ్యంలో స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు సాంకేతికతను చేరువ చేసేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9000 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు అందించనున్నట్లు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read Also: PV Narasimha Rao: పీవీకి చంద్రబాబు, లోకేశ్ నివాళి