ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నష్టపోయిన రైతులను పరామర్శించారు. వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లిలో ఆయన పర్యటించి, నష్టపోయిన పంటలను పరిశీలించారు.

పులివెందులలో జగన్ పర్యటన
ఈ పర్యటనలో రైతులతో జగన్ ముఖాముఖిగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పూర్తిగా నీట మునిగిపోయిందని, ఈ పరిస్థితిలో వారికి ఎలాంటి ఆదుకోవడం లేదని బాధిత రైతులు ఆయనకు వివరించారు. ప్రధానంగా, పంట బీమా లేని కారణంగా తాము మరింత తీవ్రంగా నష్టపోయామని రైతులు జగన్‌కు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పంట బీమా హక్కుగా అమలు చేశామని గుర్తుచేశారు. పంట నష్టపోయిన రైతులకు క్రమం తప్పకుండా భరోసా నిధులు అందించామని తెలిపారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాలను పూర్తిగా నిలిపివేసిందని జగన్ ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, గత ఏడాదికి సంబంధించిన రైతు భరోసా నిధులను ఇప్పటికీ విడుదల చేయకపోవడం చాలా పెద్ద సమస్యగా మారిందని జగన్ విమర్శించారు. రైతు భరోసా కాదు తాము అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.26 వేలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 26 పైసలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు.
రైతులకు జగన్ హామీ
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కానీ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తామని జగన్ చెప్పారు. పార్టీ స్థాయిలోనూ బాధిత రైతులకు సాయం చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులతో పాటు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట బీమా వంటి పథకాలను పునరుద్ధరిస్తామని జగన్ స్పష్టం చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఏపీలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాల వల్ల అనేక జిల్లాల్లో పంటలు పూర్తిగా నష్టపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల పంట నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. తక్షణమే నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలి. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి. పంట బీమా పథకాన్ని మళ్లీ అమలు చేయాలి. ఇన్‌పుట్ సబ్సిడీ అందించడం ద్వారా రైతులకు ఊరట కల్పించాలి. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారం దొరకకపోతే, ప్రభుత్వంపై ఆగ్రహం మరింత పెరిగే అవకాశముంది. జగన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. మరి ఈ అంశంపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.