తెలంగాణ బడ్జెట్ 2025-26 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండవ బడ్జెట్. భట్టి విక్రమార్క సభలో ప్రసంగిస్తు కీలకమైన ఆర్థిక కేటాయింపులు అలాగే కీలక విషయాలను వెల్లడిస్తూ ప్రసంగించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రకముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై కీలక కేటాయింపులు చేసారు.

ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం రూ.56,084 కోట్లు
ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం రూ.56,084 కోట్లు కేటాయించింది. ఇందులో మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, గృహ జ్యోతికి రూ.2,080 కోట్లు, సన్న బియ్యం బోనస్‌కు రూ.1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లతో కీలక కేటాయింపులు చేసారు.
తెలంగాణ విజన్
అయితే రైజింగ్ తెలంగాణ విజన్ కింద ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం నిబద్ధతను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు. వైద్య కళాశాల నిర్మాణానికి గణనీయమైన కేటాయింపులను ఆయన హైలైట్ చేశారు ఇంకా సంక్షేమం అండ్ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై రాష్ట్రం దృష్టి సారించిందని పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమం సహా గ్రామీణాభివృద్ధిని బలోపేతం చేయడం లక్ష్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ అభయ హస్తం వంటి వివిధ పథకాలకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించింది.
మహిళలకు అగ్ర ప్రాధాన్యత
తెలంగాణ బడ్జెట్‌లో మహిళలకు అగ్ర ప్రాధాన్యత కొనసాగుతోంది. మహాలక్ష్మి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ద్వారా ప్రభుత్వం రూ. 5,005 కోట్ల కేటాయించింది. అదనంగా ఉచిత గ్యాస్ పంపిణీ కోసం రూ. 433 కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగ అవకాశాల శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో ఇంధన శాఖకు రూ.21,221 కోట్లు కేటాయించింది, ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మే 2025 నాటికి పూర్తి చేయాలనీ తెలిపింది.
నీటిపారుదల రంగానికి రూ.23,373 కోట్లు
2025-26 బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ.23,373 కోట్లు కేటాయించింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఆధారంగా గ్రూప్ A అండ్ గ్రూప్ Bగా వర్గీకరిస్తారు. నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 31 ఫ్లైఓవర్లు, 17 అండర్‌పాస్‌ల నిర్మాణానికి HICITI చొరవ కింద రూ.7,032 కోట్లు కేటాయించారు. 5,942 కోట్ల రూపాయల వ్యయంతో ORR స్టేజ్ II నీటి సరఫరా పథకం, కీలక ప్రాంతాలలో నీటి పంపిణీని పెంచడం పై లక్ష్యం పెట్టుకుంది.