ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందంపై పుతిన్‌తో మాట్లాడనున్నట్లు చెప్పారు. పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించే అవకాశాలు ఉన్నాయి. గత వారం శాంతి ఒప్పందం కోసం అనేక చర్యలు చేపట్టామన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు. భూభాగం అప్పగింత గురించి మాట్లాడుతామన్నారు. పవర్ ప్లాంట్ల గురించి కూడా చర్చిస్తామన్నారు.

ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ
ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేందుకు పుతిన్, ట్రంప్ మాట్లాడుకోనున్నట్లు కొన్ని రోజుల క్రితం అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్‌కాఫ్ తెలిపారు. ఇటీవల మాస్కోలో పుతిన్‌తో విట్‌కాఫ్ భేటీ అయ్యారు. ఆ చర్చలు పాజిటివ్‌గా ముగిసినట్లు ఆయన చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ వర్గాలు.. చర్చలు చేపట్టేందుకు సముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల అమెరికా నేతృత్వంలో జెడ్డాలో జరిగిన భేటీలో ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే ఆ ప్రతిపాదనకు రష్యా కూడా అనుకూలంగా ఉన్నది. కానీ కొన్ని షరతులు విధించనున్నది. ఈ నేపథ్యంలో ట్రంప్, పుతిన్ ఫోన్ చర్చలు కీలకం కానున్నాయి.