భర్త కాకుండా మరో వ్యక్తితో భార్య శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమం సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని కోర్టు తీర్పునిచ్చింది. ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
కేసు నేపథ్యం
మధ్యప్రదేశ్ లోని చింద్వారా కు చెందిన భార్యాభర్తలు పరస్పర వివాదం తర్వాత కోర్టును ఆశ్రయించారు. భర్తకు వ్యతిరేకంగా రెండు జిల్లా కోర్టులు తన భార్యకు భరణం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశాయి. ఇటార్సి కోర్టు ఆదేశం ప్రకారం.. భర్త తన భార్యకు నెలకు రూ.4000 భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అదే ఉత్తర్వును చింద్వారా కోర్టు కూడా తన తీర్పులో వెల్లడించింది. అనంతరం భర్త మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందున ఆమెకు భరణం పొందే హక్కు లేదని వాదనలు వినిపించాడు. అయితే భావోద్వేగ ప్రమేయం అక్రమ సంబంధం కిందకు రాదని అతడి పిటిషన్ ను కొట్టివేసింది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని.. భార్యకు శారీరక సంబంధాలు లేకుండా వేరే వ్యక్తి పట్ల ప్రేమ, ఆప్యాయత చూపిస్తే.. అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

శారీరక సంబంధానికి ఆధారాలు లేవు
ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(BNSS)లోని సెక్షన్ 144(5), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CrPc)లోని సెక్షన్ 125(4)లను ప్రస్తావిస్తూ భార్యక అక్రమ సంబంధం ఉందని రుజువైతే ఆమెకు భరణం నిరాకరించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఆమెకు సంబంధం ఉందనే ఆరోపణలు నిలబడవని పేర్కొంది. శారీరక సంబంధం లేకుండా ప్రేమించడాన్ని తప్పుగా పరిగణించలేమని చెప్పింది. భర్తతో విడిగా ఉంటున్న ఆమెకు చట్ట ప్రకారం భరణం చెల్లించాల్సిందేనని భర్త పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్నిసమర్ధించిన హైకోర్ట్
మరోవైపు తాను రూ.8000 జీతానికి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నానని.. కుటుంబ సభ్యులు కూడా తనకు ఆస్తి ఇవ్వకుండా పొళ్లగొట్టారని.. తన భార్య ఇప్పటికే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం రూ.4000 అందుకుంటోందని.. సీఆర్పీసీ సెక్షన్ 125 కింద అదనంగా రూ.4000 ఇవ్వడం సమంజసం కాదని ఆ భర్త వాదించాడు. కానీ కోర్టు అతని వాదనను అంగీకరించడానికి నిరాకరించింది. ఈ వాదనల్లో ఎలాంటి అర్హత లేదని భావించి ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. అంతే కాకుండా.. తన భార్య బ్యూటీ పార్లర్ ద్వారా ఆదాయం సంపాదిస్తోందనే భర్త వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ భర్త పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.