తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత సంతతి రీసర్చ్ స్కాలర్ బదర్ ఖాన్ సురిని అమెరికానుంచి బహిష్కరించవద్దని ఆదేశిస్తూ అమెరికన్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. బదర్ ఖాన్‌ను భారతదేశానికి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వర్జినీయా డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి పాట్రీసియా గైల్స్ అడ్డుకున్నారు. బదర్ ఖాన్ సురి భార్య మఫజ్ యూసుఫ్ సలేహ్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. బదర్ ఖాన్ సురికి పాలస్తీనా సంస్థ హమాస్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మార్చ్ 17న యూఎస్ హోమ్‌ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అతనిని అదుపులోకి తీసుకుంది.
ఆయన వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో రీసర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. ఆయన భార్య మఫజ్ సలేహ్ పాలస్తీనీయురాలు. ఆమె అమెరికాలో జర్నలిస్టు.

నెల్సన్ మండేలా సెంటర్ లో ఎంఏ చదివారు
బదర్ ఖఆన్ సురి జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ సెంటర్‌లో ఎంఏ చదివారు. అదే సంస్థ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
“ట్రాన్సిషన్ డెమోక్రసీ, డివైడెడ్ సొసైటీస్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ పీస్: ఏ స్టడీ ఆఫ్ స్టేట్ బిల్డింగ్ ఇన్ ఆఫ్గానిస్తాన్ అండ్ ఇరాక్” అనే టైటిల్‌తో థీసీస్ రాశారు. మార్చి 17వ తేదీ రాత్రి వర్జీనియాలోని అర్లింగ్‌టన్‌లోని తన ఇంట్లో ఉన్నసురిని అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది.
లాయర్ ఏం చెప్పారు?
బదర్‌ఖాన్‌ను తక్షణం విడుదల చేయాలని ఆయన తరపు న్యాయవాది హసన్ అహ్మద్ కోరారు. పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని బదర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.
బదర్‌ఖాన్ భార్య పాలస్తీనీయురాలని, ఆమె పాలస్తీనా కోసం పని చేస్తున్నారని అందుకే బదర్‌ఖాన్‌ను అరెస్టు చేశారని హసన్ అహ్మద్ చెప్పారు.