సింగర్ సోనూ నిగమ్ చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులో ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరీ సందర్భంగా కన్నడ పాట పాడాలంటూ ఓ అభిమాని చేసిన డిమాండ్‌పై సోనూ నిగమ్ స్పందిస్తూ పహల్గామ్ ఘటనను ప్రస్తావించడం కొందరి మనోభావాలను దెబ్బతీసింది. ఈ పరిణామం కన్నడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. కచేరీలో సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతుండగా ప్రేక్షకుల్లోంచి ఒక అభిమాని కన్నడలోనే పాట పాడాలని డిమాండ్ చేశాడు. అతడి తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన సోనూ నిగమ్ మధ్యలోనే పాటను ఆపేశాడు. అభిమాని బెదిరించినట్టుగా మాట్లాడటం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు అన్ని భాషల పట్ల, ముఖ్యంగా కన్నడ భాష పట్ల గౌరవం ఉందని తెలిపాడు.అభిమాని ప్రవర్తనపై సోనూ నిగమ్ స్పందిస్తూ ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రస్తావించాడు. ‘పహల్గామ్‌లో ఏం జరిగిందో దానికి ఇదే కారణం. కచ్చితంగా ఇదే. ఇప్పుడు మీరు (ఆ అభిమానిని ఉద్దేశించి) ఏం చేశారో అలాంటి వైఖరే ఆ దాడికి కారణం. డిమాండ్ చేసే ముందు ఎదురుగా ఎవరున్నారో కనీసం గమనించాలి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. భాషను ఉద్దేశించి కాకుండా డిమాండ్ చేసిన తీరును విమర్శిస్తూ సోనూ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పహల్గామ్ ఘటనతో పోల్చడం తీవ్ర వివాదాస్పదమైంది.
మాట్లాడటం
సోనూ నిగమ్ వ్యాఖ్యలు భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని కన్నడ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే, అదే వేదికపై సోనూ నిగమ్ కన్నడ భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘నేను అన్ని భాషల్లోనూ పాటలు పాడాను. కానీ నా జీవితంలో అత్యధికంగా మంచి పాటలు పాడింది కన్నడలోనే. నేను బెంగళూరు వచ్చిన ప్రతీసారి మీరు నాపై ఎంతో ప్రేమ కురిపిస్తారు. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించడం నాకు దక్కిన గౌరవం. కానీ ఆ అబ్బాయి నాతో మాట్లాడిన తీరు నచ్చలేదు. అతడు పుట్టకముందు నుంచే నేను కన్నడ పాటలు పాడుతున్నాను. అలా బెదిరింపు ధోరణిలో మాట్లాడటం నన్ను బాధించింది. నేను ప్రపంచంలో ఎక్కడ కచేరీ చేసినా, అక్కడ వేల మందిలో కచ్చితంగా కన్నడ వారు ఉంటారు. వారి కోసమే కన్నడ పాటలు పాడతాను’ అని సోనూ నిగమ్ తన ఆవేదనను, కన్నడ భాషపై తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశాడు.

మనోభావాలు
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటక రక్షణ వేదిక సోను నిగమ్‌పై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ ఎస్)లోని సెక్షన్లు 352(1) (వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 351(2) (నేరపూరిత పరువు నష్టం), 353 (మతపరమైన లేదా భాషాపరమైన మనోభావాలను దెబ్బతీయడం) కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. బెంగళూరు పోలీసులు ఫిర్యాదును స్వీకరించినట్లు తెలిపారు, అయితే ఇంకా ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ ఆరోపణలపై సోను నిగమ్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. కన్నడ సంఘాలు సోను నిగమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.