అంతరిక్షంలో నివసించడం, భూమిపైకి తిరిగిరావడం అనేది కష్టమైన, సవాళ్లతో కూడిన ప్రయాణం. భూమికి తిరిగొచ్చాక కూడా వ్యోమగాములు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం, దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండి భూమిపైకి తిరిగొచ్చాక వ్యోమగాములు మామూలుగా నిలబడలేరు. కనీసం కుదురుగా నడవలేరు. తమవారిని చూడటానికి వెంటనే నేరుగా ఇంటికి కూడా వెళ్లలేరు. అంతరిక్షం నుంచి వచ్చాక వ్యోమగాముల శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. వాటి నుంచి వారు ఎలా కోలుకుంటారు? కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది?

ఆ వాసన, గాలి చాలా అద్భుతం
అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన తర్వాత నాసా సైంటిస్ట్ విక్టర్ గ్లోవర్‌తో చేసిన ఇంటర్వ్యూను నాసా వెబ్‌సైట్ ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూలో ”భూమిపైకి తిరిగొచ్చాక మీరు మొదట చూసిన వాసన ఏంటి?” అని ఆయన కూతురు ప్రశ్నించారు. సముద్రంలో స్టార్‌షిప్ దిగగానే తనకు మొదట సముద్రపు వాసన వచ్చిందని ఆయన బదులిచ్చారు. ”ఆ వాసన, గాలి చాలా అద్భుతం” అని ఆయన చెప్పారు.
ఎముకల నుంచి కంటిచూపు వరకు: అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాములు ఎదుర్కొనే తొలి సమస్య ఎముకల సాంద్రత క్షీణించడం. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల, భూమిపై ఉన్నప్పటిలా బరువును మోయగలిగేలా వెన్నెముక, పెల్విస్ పటిష్టంగా ఉండవు. కాబట్టి అంతరిక్షంలో రోజులు గడిచేకొద్దీ ఎముకల సాంద్రత ప్రతీ నెలకూ 1 నుంచి 1.5 శాతం వరకు క్షీణిస్తుంది. కండరాల, ఎముకల బలహీనతను నివారించేందుకు వ్యోమగాములు రోజుకు 2 గంటల పాటు వ్యాయామం చేయాలి.
అంతరిక్షంలో తేలుతూ ఉండి, భూమిపైకి వచ్చాక వ్యోమగాములు నిలబడలేరు, కనీసం నడవలేరు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల శరీరంలో ద్రవాలు పైకి అంటే తలలోకి కదులుతాయి. ఇవి కళ్లపై ఒత్తిడి పెంచి కంటిచూపు సమస్యలకు దారి తీస్తాయి.