దర్యాప్తు పూర్తి అయినప్పటికీ చిన్న చిన్న నేరాల్లో దిగువ కోర్టులు బెయిల్ నిరాకరించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణ కేసుల్లో సైతం నిందితులకు ఉపశమనం లభించకపోవడం దురదృష్టకరం అని.. అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు కూడా చేరలేదని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వస్తున్నాయని చెప్పింది. ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పని చేయకూడదని హితవు పలికింది.

హితవు పలికిన సుప్రీం
ఒక చిన్న కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని 2 సంవత్సరాలకు పైగా పోలీసులు కస్టడీలో ఉంచుకున్నారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి అయి ఛార్జీషీట్ దాఖలు చేసినప్పటికీ.. నిందితుడికి బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి. దీంతో అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సోమవారం రోజు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం షాకింగ్ కామెంట్లు చేసింది. ఒక ప్రజాస్వామ్య దేశం పోలీసుల రాజ్యంలా పని చేయకూడదని హితవు పలికింది.
ఏక పక్ష ధోరణి మంచిది కాదు
ఇక్కడ నిజా నిజాలతో సంబంధం లేకుండా చట్టం అమలు చేసే సంస్థలు కొందరు వ్యక్తులను నిర్భందించేందుకు ఏక పక్ష ధోరణిలో వ్యవహరిస్తారని చెప్పుకొచ్చింది. ఇలా చేయడం ఆమోద యోగ్యం కాదంటూనే.. 20 ఏళ్ల క్రితం ఇలాంటి సాదారణ కేసు బెయిల్ పిటిషన్లు హైకోర్టుల వరకు కూడా వచ్చేవి కావని గుర్తు చేసింది. కానీ ఇప్పుడు నేరుగా సుప్రీం కోర్టుకే వస్తున్నాయని తెలిపింది.
సుప్రీం కోర్టుకు పెద్ద మొత్తంలో పిటిషన్లు
దిగువ కోర్టులు బెయిల్ ఇవ్వకపోవడంతో.. సుప్రీం కోర్టుకు పెద్ద మొత్తంలో పిటిషన్లు వస్తున్నాయని.. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మరియు ఉజ్జల్ భూయాన్ లతో కూడి ధర్మాసనం పేర్కొంది. దీని గురించి అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదని.. చిన్న చిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంలో ట్రయల్ హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించింది.
అంతేకాకుండా దర్యాప్తు సమయంలో అరెస్టు చేయని, దర్యాప్తులో సహకరించని నిందితుడిని ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత అదుపులోకి తీసుకోకూడదని పేర్కొంది. బెయిల్ మంజూరు ప్రక్రియను క్రమబద్దీకరించడానికి కొత్త చట్టాన్ని రూపొందించాలని కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.