బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు చేరి, వాహనాలు కొట్టుకుపోయాయి. శనివారం రాత్రి కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వనస్థలిపురం, హయత్‌నగర్, బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రాత్రి 8, 9 గంటల తర్వాత నగరంలోని మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్(Hyderabad)లోని పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, ఎల్బీనగర్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సిబ్బంది సూచించారు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనూ శనివారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు రాత్రి వేళల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ప్రజలు వరద నీటిని దాటడం, పాత భవనాల వద్ద ఆశ్రయం తీసుకోవడం వంటివి చేయవద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో సహాయక చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. రానున్న మరో రెండు రోజులు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఉత్తర శ్రీలంక వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో నాలుగు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Also : Pulivendula : విజయవాడలో ఈసీ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల ధర్నా