తీవ్రస్థాయికి చేరిన పరిస్థితి
పాకిస్తాన్ భవిష్యత్తు గురించి ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క భారత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు మరో వైపు బెలూచిస్తాన్ సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వేర్పాటువాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు, ఉగ్రవాదం, వేర్పాటువాదం కలిసి దేశాన్ని అస్థిరంగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ కూడా కీలకంగా మారింది.
బెలూచిస్తాన్ పోరాటం – కొత్త దేశం ఏర్పడుతుందా?
బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పోరాటం విజయవంతమైతే ప్రపంచ పటంలో మరో కొత్త దేశం అవతరిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. 1947లో మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ ఇప్పుడంతే అస్థిరంగా మారింది. అభివృద్ధి దిశగా నడుస్తున్న భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాద కేంద్రంగా మారిన ఈ దేశం ఎప్పటికప్పుడు చైనా, సౌదీ అరేబియా, ఐఎంఎఫ్‌ల వైపు చూసే పరిస్థితిలో ఉంది.
కాశ్మీర్‌పై కుట్రలు:
బెలూచిస్తాన్ వేర్పాటు కదలిక
భారత్‌తో కాశ్మీర్ విషయంలో కుట్రలు పన్నే పాకిస్తాన్‌కి ఇప్పుడు బెలూచిస్తాన్ సమస్య బలమైన ఝలక్ ఇస్తోంది. స్వతంత్ర బెలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా ఓ రైలును హైజాక్ చేసి తమ శక్తిని ప్రదర్శించింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్‌లో అత్యంత కీలకమైన భూభాగం. ఇది మొత్తం దేశ భూభాగంలో 44% ఉండటమే కాక, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇక్కడి అభివృద్ధి పూర్తిగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతాలకు మాత్రమే జరుగుతోంది.
పాక్ ప్రభుత్వ వైఫల్యం
బెలూచిస్తాన్ అసంతృప్తి
బెలూచిస్తాన్‌ను పాకిస్తాన్‌లో కలిపే సమయంలోనే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అభివృద్ధి విషయంలో తీవ్ర వివక్ష తట్టుకోలేక 2000 నుండి అక్కడ వేర్పాటువాద ఉద్యమం ఊపందుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బెలూచిస్తాన్ పూర్తిగా స్వతంత్ర దేశంగా మారడం సులభం కాదు. చైనా, సౌదీ వంటి దేశాలు పాకిస్తాన్‌కు అండగా నిలిచే అవకాశం ఉంది. కానీ ఇటీవల జరిగిన ట్రైన్ హైజాక్ ఘటన చిన్నది కాదు.
రెస్క్యూ ఆపరేషన్ – పాక్ ఆర్మీకి షాక్
క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బెలూచి ప్రావిన్స్‌లో బీఎల్ఏ మిలిటెంట్లు హైజాక్ చేశారు. 440 మంది ప్రయాణిస్తున్న ఈ రైలును బాంబులతో ట్రాక్ పేల్చేసి, ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. పాక్ ప్రభుత్వం ఈ ఘటనలో 33 మంది మిలిటెంట్లను హతమంచామని ప్రకటించగా, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ ప్రకటనను ఖండించింది.
పాకిస్తాన్ ఆర్మీ నిజాలు దాచుతోందా?
పాక్ సైన్యం మొత్తం ఆపరేషన్ ముగిసిందని ప్రకటించింది. అయితే అక్కడ ఇంకా 150 మంది ఆర్మీ సిబ్బంది, సాధారణ ప్రజలు బందీలుగా ఉన్నారని బీఎల్ఏ పేర్కొంది. పైగా, ఈ ఆపరేషన్ ముగిసిందంటూ పాక్ ఆర్మీ విడుదల చేసిన ఫోటోలు 2024 నాటివని తేలింది. దీంతో పాక్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాలు మరింత గట్టిపడుతున్నాయి.
పాకిస్తాన్ భవిష్యత్తు?
ప్రస్తుత పరిస్థితుల్లో బెలూచిస్తాన్ వేర్పాటు వాదం మరింత బలపడే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటుండగా, బెలూచిస్తాన్ సమస్య మరో పెద్ద దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఇకపై ఈ పోరాటం ఏ దిశగా వెళ్తుందనేది చూడాలి.