అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చిన 29,000 పైచిలుకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయారు. రోడ్ల మీదకు వచ్చి ముళ్లకంచెల మధ్య కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకున్నారు. 2,000 పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజున మీ కన్నీళ్లు తుడిచేవాళ్లున్నారా అని మహిళా రైతులు నన్ను అడిగారు. అమరావతియే శాశ్వత రాజధానిగా ఉంటుందని మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదగా మళ్లీ పునఃప్రారంభం జరగబోతుంది.
ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు
ఆదిశంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా అమరావతి పునఃప్రారంభం కావడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన హబ్ ఇది. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాస ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే ఇల్లు లేనివాడు. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది ప్రజల కోసం రాజధానిలో నగరం నిర్మించడానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు.
రైతుల త్యాగాలు, పోరాటాలు
దివిసీమ తుఫాను వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్లు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకు వచ్చేలా పని చేశారు. ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా అమరావతి రైతులు ఈ ధర్మయుద్ధంలో విజయం సాధించారు. రైతులు 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూముల్ని ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు ధన్యవాదాలు. గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుంది అనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేశారు.
ప్రభుత్వ హామీలు, అభివృద్ధి ప్రణాళికలు
ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. అమరావతి ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ట రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారితనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. కేంద్ర రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని గారు శంకుస్థాపనలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు విజన్, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
రాళ్లల్లో రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి, 20 సంవత్సరాలు ముందుకెళ్లి చూసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన సైబరాబాద్ సిటీని ఎలా నిర్మించారో అమరావతిని కూడా అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతారు. కాశ్మీర్‌లో 28 మందిని చంపేసిన క్లిష్ట సమయంలో కూడా ప్రధానమంత్రి గారు అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకుండా ఇక్కడికి వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. భవాని మాత ఆశీస్సులతో వారికి బలాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం. జై భవాని, జై భారత్, జై హింద్.