స్టోన్ క్రషర్ యజమాని నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలపై విమర్శలు గుప్పించారు. తనపై తప్పుడు కేసులు పెట్టించారని, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, తన ఫోన్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

శ్రీకృష్ణదేవరాయల ఘాటైన స్పందన
విడదల రజని చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఘాటుగా స్పందించారు. మీ ఫోన్ డేటా తీయాలని నేను ప్రయత్నించానని మీరు ఆరోపిస్తున్నారు. కానీ, ఫోన్ డేటా, భూముల అంశాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని హితవు పలికారు. 40 ఏళ్లుగా విజ్ఞాన్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నామని, తమది మచ్చలేని చరిత్ర అని స్పష్టం చేశారు. అమరావతిలో స్థలం కోసం తాము దరఖాస్తు చేసుకోలేదని, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు వేలం వేసినప్పుడు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసినట్టు తెలిపారు. భూముల వేలానికి, భూముల కేటాయింపులకు మధ్య ఉన్న తేడా ఏమిటో విడదల రజని తెలుసుకోవాలని సూచించారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఆరోపణలు చేస్తే నవ్వులపాలవుతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విడదల రజని ఆరోపించగా, ఆ వ్యాఖ్యలు అసత్యమని శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. విడదల రజని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆమె మాదిరి తాను అబద్ధాలు మాట్లాడలేనని అన్నారు. ఐపీఎస్ అధికారి జాషువా తన సర్వీసు 2040 వరకు కొనసాగుతుందని, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం తానెవరితోనూ సంబంధం పెట్టుకోలేదని వివరించారు.
2021 ఆగస్ట్ 24న విడదల రజని ఫిర్యాదు ఇచ్చిందని, స్టోన్ క్రషర్ యజమానిపై అక్రమ ఆరోపణలు చేసింది ఆమెనేనని గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి తనపై ఆరోపణలు చేయడం విడదల రజని ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. మీ స్వార్థం కోసం అధికారులను బెదిరించడమేనా? అంటూ ఆయన మండిపడ్డారు. విడదల రజని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తాను ఫిర్యాదు చేసినట్టు ఆమె చెబుతున్నారని పోతారం బాషా, ఎంపీపీ శంకర్ రావు, ముత్తా వాసు, గోల్డ్ శీను, అబ్బాస్ ఖాన్, నాగయ్య వద్ద విడదల రజని డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. కేసును ఆపమని విడదల రజని రాయబారం పంపింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. విడదల రజని తన రాజకీయ భవిష్యత్తును రక్షించుకునేందుకు టీడీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకునే స్థాయిలో ఉన్నారని, అసత్య ప్రచారాలు చేసుకుంటూ రాజీకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఐడీ విచారణ వేగంగా జరుగుతుండగా, విడదల రజని ఈ కేసులో ఏ విధంగా బయటపడతారనేది ఆసక్తిగా మారింది. అలాగే, టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయల ఆరోపణలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.