గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇటీవల పోలీసుల కస్టడీ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన చేసిన వ్యాఖ్యలు, కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.వంశీ తన అఫిడవిట్‌లో పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. “ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే నన్ను ఎక్కడున్నానో ట్రాక్ చేసి అరెస్టు చేశారు. దర్యాఫ్తు చేశాకే అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ కస్టడీ ఎందుకు? అంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయంలో, ఈ కేసులో ముందుగా దర్యాఫ్తు చేసి, అవసరమైతే ఆపై అరెస్టు చేయాలి. కానీ, ఇక్కడ క్రమశిక్షణా రీత్యా తప్పిదం జరిగిందని వంశీ కోర్టుకు తెలిపారు.పోలీసులకు తాను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేస్తూ కస్టడీకి అప్పగించడం సమయం వృథా చేయడమేనని వాదించారు. ఆర్టికల్ 20(3) ప్రకారం తన వస్తువులను పోలీసులకు అప్పగించాల్సిన అవసరం లేదని చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించినది, అప్పట్లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉంది. వంశీ మోహన్‌పై ఆరోపణల ప్రకారం, ఆయన అనుచరులను ప్రోత్సహించి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించారు. ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయబడింది.

బెయిల్ పిటిషన్
వంశీ బెయిల్ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలు చేయడానికి రెండు రోజుల సమయం కావాలని కోర్టును కోరింది. కోర్టు ఈ అభ్యర్థనను అంగీకరించింది.
వంశీ అరెస్టును వైఎస్ఆర్ సిపిఅధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడ సబ్-జైల్లో వంశీని కలిసిన తర్వాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అరెస్టు రాష్ట్రంలో చట్టం,వ్యవస్థ క్షీణతకు నిదర్శనమని, పోలీసులు రాజకీయ నాయకుల ఆదేశాలకు లోబడకుండా చట్టాన్ని పాటించాలని హెచ్చరించారు.
ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి. వంశీ అరెస్టు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు, టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారాయి.