వెండితెరపై తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్న ఊర్వశి శారద, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజకీయ జీవితం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడారు.ప్రజలకు సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ రంగం తనకు అనుకూలంగా అనిపించలేదని ఆమె పేర్కొన్నారు.శారద చెప్పిన విషయాల ప్రకారం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలోనే ఆమెకు రాజకీయాల్లోకి వచ్చే ఆహ్వానం వచ్చినట్లు తెలిపింది.“ఆ సమయంలో రాజకీయాలంటే భయం వేసేది. పూర్తిగా తెలియని రంగం కావడం వల్ల నేను సున్నితంగా తిరస్కరించాను.నన్ను ఆహ్వానించిన వారితోనే ‘నాకు భయం, రాలేను’ అని చెప్పించాను” అని ఆమె చెప్పింది.అయితే, 1996లో రాజకీయాల్లోకి రావడానికి ఓ మలుపు కలిగింది.అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను స్వయంగా ఆహ్వానించారట.

“చంద్రబాబు గారు నన్ను భరోసా ఇచ్చారు’ఏం భయపడొద్దు, నేనున్నాను’ అన్నారు.ఆయన మాటలే నాకు ధైర్యం ఇచ్చాయి.ఆ విశ్వాసంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను” అని ఆమె ఆనాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. తెనాలి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన తర్వాత, తన లక్ష్యం ప్రజల సమస్యలను పరిష్కరించడమేనని స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి సమస్యలపై గట్టి పోరాటం చేశానని తెలిపారు.”ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మలయాళీ అధికారులు నాకు ఎంతో సహకరించారు. నేను ఫైల్ పట్టుకెళ్తే, వారు సాయం చేయడం వల్ల పనులు త్వరగా పూర్తయ్యేవి.
ఈ అనుభవాలు మరిచిపోలేను” అని ఆమె ఉద్వేగంగా తెలిపారు.అయితే రాజకీయాల్లో ప్రయాణం అంత సాఫీగా సాగలేదని, కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయని ఆమె వాపోయారు.”ప్రజలు నిజంగా మంచివాళ్లే.కానీ కొందరు స్థానిక నాయకులకు నా నిజాయితీ నచ్చలేదు. నేను బలపడటం వాళ్లకు ఇష్టం లేదు.ఐదారుగురు నాయకులు కలిసి కుట్ర చేశారు.నన్ను ఓడించడానికి డబ్బాలు మార్చారని తెలిసింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఓటమి తర్వాత కూడా ఆమెలో అసహనం కనిపించలేదు. “అంతవరకే అదృష్టం ఉందని అనుకున్నాను. బాధపడలేదు” అని ఆమె అన్నారు రాజకీయాల్లోకి వచ్చిందంటే ప్రజల్ని ప్రేమించి, వారికి తిరిగి సేవ చేయాలనే ఆలోచనతోనే అని ఆమె స్పష్టం చేశారు.ఇప్పుడు శారద రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. చెన్నైలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని చెప్పారు. “నాకు ఉన్న మంచి పేరును చెడగొట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే రాజకీయం నుంచి తప్పుకున్నాను” అంటూ తన నిజాయితీని మరోసారి రుజువు చేశారు.
Read Also :Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్