వీవీఐపీ పాసులు రద్దు.. నో వెహికల్ జోన్‌గా ప్రకటించిన అధికారులు
ప్రయాగ్‌రాజ్: మహాకుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో యాత్రికుల రద్దీ, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీచేశారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలకు పోటెత్తడంతో తొక్కిసలాటకు దారితీసి.. 30 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులు, వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. వీవీఐపీ పాస్‌లు రద్దుచేయాలని, పార్కింగ్ జోన్‌లను ఎత్తివేయాలని యోగి ఆదేశాలు జారీ చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతాన్ని పూర్తిగా నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. మహాకుంభ్ ప్రాంతంలోకి వాహనాల ఎంట్రీని నిషేదించారు. వన్‌వే రూట్లను అమలు చేస్తున్నారు. భక్తులు సలువుగా నడిచేందుకు వన్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేయనున్నారు. డిస్ట్రిక్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు చాలా కఠిన నిబంధనలు పాటించనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీలర్ వాహనాల ఎంట్రీని నిలిపివేశారు. కుంభమేళా ప్రాంతంలో ట్రాఫిక్ సజావుగా జరిగేలా చూడాలని, అనవసరమైన హాల్టులను నివారించాలని అధికారులను ఆదిత్యనాథ్ ఆదేశించారు. జనసమూహం ఎక్కడా పెరగకూడదని, రోడ్లపై ఎటువంటి రద్దీ ఉండకూడదని సూచించారు. రోడ్లపై వీధి వ్యాపారులను ఖాళీ ప్రాంతాలకు తరలించి, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. కుంభమేళాను సందర్శించే భక్తులను అనవసరంగా ఆపకూడదని ఆదిత్యనాథ్ అన్నారు.

మేళా జరిగే ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలని పోలీసులకు సూచనలు చేశారు. అయోధ్య-ప్రయాగ్‌రాజ్, కాన్పూర్-ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్-ప్రయాగ్‌రాజ్, లక్నో-ప్రతాప్‌గఢ్- ప్రయాగ్‌రాజ్, వారణాసి-ప్రయాగ్‌రాజ్ వంటి మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్‌వైపు వచ్చే అన్ని మార్గాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని పేర్కొన్నారు.