ముఖేష్ అంబానీ తన సాంప్రదాయ వ్యాపారాలను ప్రస్తుతం న్యూ ఏజ్ టెక్నాలజీల వైపుకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ నుంచి సోలార్ వరకు అనేక రంగాల్లో ఉన్న వ్యాపార అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన పాదముద్రను అనేక రంగాల్లోకి విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుభంద సంస్థగా ఉన్న రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ లిమిటెడ్ అధునాతన సాంకేతికతతో కెమికల్ సెల్స్ తయారీకి భారత ప్రభుత్వం నుంచి పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నుంచి ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహకాలను అందించే స్కీమ్ కింద కాంట్రాక్టును రిలయన్స్‌కి అందించబడింది. దీనికింద రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రూ.3,620 కోట్లను ప్రోత్సాహకాల రూపంలో పొందనుందని వెల్లడైంది.

క్యాబినెట్ ప్రతిపాదనలో వెల్లడి
వాస్తవానికి ఉత్త్పతి ఆథారిత ప్రోత్సాహకాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.18,100 కోట్లను అందించాలని నిర్ణయించింది. అయితే ఈ స్కీమ్ కింద ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ లిమిటెడ్ దాదాపు 10 గిగావాట్ అవర్ సామర్థ్యం కలిగిన అడ్వాన్స్డ్ కెమికల్ సెల్స్ తయారీ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. అధునాతన కెమిస్ట్రీ సెల్స్ విద్యుత్ శక్తిని ఎలక్ట్రోకెమికల్ లేదా రసాయన శక్తిగా నిల్వ చేయగలవు. ఆ ఎనర్జీని అవసరమైనప్పుడు తిరిగి విద్యుత్ శక్తిగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీలను తయారు చేయటానికి 2021 మే నెలలో ప్రభుత్వం దేశీయంగా పీఎల్ఐ స్కీమ్ కింద 50 గిగావాట్ అవర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించటం కోసం క్యాబినెట్ ప్రతిపాదనలో వెల్లడించింది. దీని తర్వాత 10 GWh బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి 7 బిడ్డర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెండర్ విజేతగా నిలిచిందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2024 సెప్టెంబర్ 4న ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కలిపి నాలుగు సంస్థలు ఈ స్కీమ్ కింద బ్యాటరీలను తయారు చేయటానికి అర్హతను పొందాయని వెల్లడైంది.
బ్యాటరీ టెక్నాలజీలకు సపోర్ట్
భారత ప్రభుత్వం శిలాజ ఇంధనాలపై నడిచే వాహనాల నుంచి ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లించే క్రమంలో ఈవీలను ప్రోత్సహిస్తున్న వేళ ఈ రంగానికి అవసరమైన బ్యాటరీ టెక్నాలజీలను కూడా చురుకుగా ప్రోత్సహిస్తోంది. విద్యుత్ వాహనాల బ్యాటరీల ఉత్పత్తికి అవసరమైన 35 వస్తువులపై ఇంపోర్ట్ డ్యూటీని కూడా కేంద్రం ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు దేశంలోని జమ్ముకశ్మీర్ ప్రాంతంలో గత ఏడాది లిథియం గుర్తించబడటం దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా నడిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.