గత మూడుసంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో రెండు దేశాలతో పాటు అనేక దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. యుద్ధం ముగింపుకు ట్రంప్ తో పాటు ఇతర దేశాలు కూడా పోరాడుతున్నాయి. ఈనేపథ్యంలో రష్యాతో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ తెలిపింది. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్- అమెరికా చర్చల తర్వాత కీయెవ్ ఈ ప్రకటన చేసింది. తాను ఈ అంశాన్ని రష్యాకు వివరిస్తానని ఇప్పుడు “బంతి వారి కోర్టులో ఉంది” అని అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియో అన్నారు. ఒప్పందం పట్ల సానుకూలంగా స్పందించేలా రష్యాను ఒప్పించడం ఇప్పుడు అమెరికా బాధ్యత అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నారు. అమెరికా యుక్రెయిన్ ప్రతినిధులు మంగళవారం జెడ్డాలో సమావేశం అయ్యారు. ఓవల్ ఆఫీసులో ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వాడీవేడి సంవాదం తర్వాత ఈ రెండు దేశాల ప్రతినిధులు అధికారికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.

బంతి రష్యాకోర్టులో ఉందన్న అమెరికా
ట్రంప్- జెలియన్‌స్కీ గొడవ తర్వాత ఉక్రెయిన్ కు అమెరికా నిలిపివేసిన నిఘా సమాచారాన్ని తక్షణం పునరుద్దరిస్తామని అమెరికా ప్రకటించింది. “దీర్ఘ కాలిక శాంతి స్థాపన కోసం చర్చలు జరిపేందుకు తమ ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసుకోవడానికి రెండు దేశాల ప్రతినిధులు అంగీకరించారు” అని సంయుక్త సమావేశం ప్రకటన వెల్లడించింది. తమ ప్రతిపాదనను రష్యా అంగీకరిస్తుందని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియో జెడ్డాలో చెప్పారు. “కాల్పులు ఆపేసి చర్చలు కొనసాగించేందుకు” ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రష్యా ఈ ప్రతిపాదన తిరస్కరిస్తే “ఇక్కడ శాంతికి అడ్డుపడుతున్నదెవరో ప్రపంచానికి తెలుస్తుంది” అని చెప్పారు. వాళ్లు కూడా శాంతి స్థాపనకు అంగీకరిస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు వాళ్లే నిర్ణయం తీసుకోవాలి” అని రుబియో చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఉపరితల దాడులతో పాటు సముద్రం, గగనతల దాడుల్ని కూడా పాక్షికంగా నిలిపివేయాలని జెలియన్‌స్కీ కోరారు. అయితే అది 30 రోజుల కాల్పుల విరమణకే పరిమితం అయింది.
జెలియన్‌స్కీకి వెల్కమ్ చెబుతా: ట్రంప్
జెడ్డాలో చర్చల తర్వాత ట్రంప్ నిర్మాణాత్మక వైఖరికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు జెలియన్‌స్కీ ప్రకటించారు. రష్యా “యుద్ధాన్ని ఆపాలనుకుంటుందా లేక కొనసాగించాలనుకుంటుందా” అనేది ఇప్పుడు తేలుతుందని జెలియన్‌స్కీ ఒక వీడియో సందేశంలో చెప్పారు. “వాస్తవాలేంటో తేలడానికి ఇది సరైన సమయం” అని ఆయన అన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనపై మాస్కోఇప్పటి వరకు స్పందించలేదు. చర్చల సారాంశం గురించి అమెరికా వివరించిన తర్వాత తాము ఒక ప్రకటన విడుదల చేస్తామమని క్రెమ్లిన్ వెల్లడించింది. సౌదీలో చర్చలపై స్పందించిన డోనల్డ్ ట్రంప్ పుతిన్ ఈ ప్రతిపాదన అంగీకరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. “ఇరు పక్షాలు సమానంగా స్పందిస్తేనే ఇది సాధ్యమవుతుంది” అని ట్రంప్ అన్నారు. కొన్ని రోజుల్లోనే కాల్పుల విరమణ అమలు కావచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు.
యూరప్ భాగస్వామ్యంపై ఉక్రెయిన్ పట్టు
అమెరికాతో చర్చల విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ తిరస్కరించలేదని రష్యా అధికారిక పత్రిక టాస్ ప్రకటించింది. జెలియన్‌స్కీతో సంబంధాలు తిరిగి పట్టాలపైకి ఎక్కాయా అని అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రుబియోను ప్రశ్నించినప్పుడు ఆయన “శాంతి చర్చలు పట్టాలకెక్కాయి” అని అన్నారు. జెడ్డాలో అమెరికా – ఉక్రెయిన్బృందాలు భేటీ కావడానికి ముందు మాస్కోపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దౌత్యం ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్సిద్ధంగా లేదని రష్యా ఆరోపించింది. యుక్రెయిన్ అమెరికా మధ్య కీలకమైన ఖనిజాల ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ట్రంప్, జెలియన్‌స్కీ అంగీకరించారని సంయుక్త ప్రకటన వెల్లడించింది. మంగళవారం చర్చల్లో ఖనిజాల ఒప్పందం ప్రస్తావనకు రాలేదని, అయితే ఉక్రెయిన్ అధికారులతో అమెరికా అధికారులు మాట్లాడారని రుబియో చెప్పారు. జెడ్డాలో చర్చల్లో పాల్గొన్నవారిలో అమెరికా జాతీయ భద్రత సలహదారు మైక్ వాల్జ్, మిడిల్ ఈస్ట్ దూత స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు.