అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఖరారైన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో ఇన్వెస్టర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ట్రంప్ వైట్ హౌస్ బాధ్యతలు చేపట్టడానికి మునుపే అనేక క్రిప్టోలు భారీ ర్యాలీని నమోదు చేశాయి. ట్రంప్ ఎన్నికల వాగ్ధానంలో భాగంగా క్రిప్టో కరెన్సీలకు ప్రాధాన్యతను అందిస్తున్నట్లు ప్రస్తుత చర్యలను చూస్తుంటే అర్థం అవుతోంది.
ఎంపికలో రిపుల్, సోలానా, కార్డానోలు
వివరాల్లోకి వెళితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మూడు క్రిప్టో కరెన్సీల పేర్లను ఎంపిక చేసుకున్నారు. వీటి ద్వారా యూఎస్ క్రిప్టో స్ట్రాటజీ రిజర్వును ఆదివారం ప్రకటించారు. ఇందులో రిపుల్, సోలానా, కార్డానోలు ప్రణాళికలో ఎంపికయ్యాయి. ఈ ప్రకటనతో ఒక్కసారిగా మార్కెట్లలో మెగా ర్యాలీ నెలకొంది. ఈ డిజిటల్ కరెన్సీల ధరలు దాదాపు 10 నుంచి 35 శాతం మధ్య భారీ పెరుగుదలను చూశాయి.

మోసాలను నివారించటం కోసం
డిజిటల్ ఆస్తుల కోసం వ్యూహాత్మక రిజర్వ్‌ను ఏర్పాటు చేయాలని అధ్యక్ష వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించిన ట్రంప్ జనవరి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత తాజా చర్య తీసుకున్నారు. అమెరికాను “క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్”గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా.. మోసాలను నివారించటం, మనీలాండరింగ్ నిరోధక చర్యలపై దృష్టి సారించిన మునుపటి పరిపాలన నియంత్రణ చర్యల నుంచి ట్రంప్ పూర్తిగా నిష్క్రమించినట్లు సంకేతాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీల రేట్లు భారీగా క్షీణించినప్పటికీ.. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ విధాన మార్పు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి రేకెత్తించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలు లేదా మరింత అనుకూల క్రిప్టో చొరవలతో జతచేయబడితే ఇది మరింత జోష్ నింపే అవకాశాలు ఉన్నాయి.
వైట్ హౌస్ క్రిప్టో సమ్మిట్
అయితే క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ ఖచ్చితమైన నిర్మాణం అస్పష్టంగానే ఉంది. దీనికి కాంగ్రెస్ ఆమోదం అవసరమా లేదా US ట్రెజరీ ఎక్స్ఛేంజ్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా అమలు చేయవచ్చా అనే అంశాలపై న్యాయ నిపుణులు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. చట్ట అమలు చర్యల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆస్తులను రిజర్వ్‌లో చేర్చవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిని ముందు గడచిన శుక్రవారం ట్రంప్ మొట్టమొదటి వైట్ హౌస్ క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహించటం గమనార్హం. దీని ద్వారా ట్రంప్ తన పరిపాలన సమయంలో క్రిప్టోలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో అందరి దృష్టి రాబోయే నియంత్రణ పరిణామాలు, పరిశ్రమపై వాటి ప్రభావంపై కొనసాగుతోంది.