అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకొస్తున్న వలస విధానాలపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత నాలుగు రోజులుగా లాస్ ఏంజిల్స్(Los Angels)లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతోన్న నేపథ్యంలో మరిన్న బలగాలను పంపాలని ట్రంప్ ఆదేశించారు. సుమారు 700 మెరీన్లను తాత్కాలికంగా లాస్ ఏంజిల్స్‌లో మోహరించాలని ఆయన సూచించారు. అంతేకాదు, ‘నిరసనకారులకు తగిన గుణపాఠం ఉంటుంది’ అంటూ ఆయన హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వలస విధానాలకు వ్యతిరేకంగా లాస్ ఏంజిల్స్‌లో పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. వలసదారుల నిర్బంధ కేంద్రం వద్ద వందలాది మంది నిరసనకారులు గుమికూడి ట్రంప్ చర్యలను తీవ్రంగా విమర్శించారు.
సిగ్గు! సిగ్గు! సిగ్గు’ అంటూ ట్రంప్‌పై విమర్శలు
లాస్ ఏంజిల్స్ నగరంలోని వలసదారుల నిర్బంధ కేంద్రం వద్ద వందలాది మంది గుమికూడి ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘సిగ్గు! సిగ్గు! సిగ్గు’ అంటూ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. నిరసనలు అదుపుతప్పడంతో పోలీసులు ఫ్లాష్‌బాంబ్‌లు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినాసరే ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ ఆస్తులు, సిబ్బందిని రక్షించేందుకు సైన్యం తాత్కాలికంగా ఒక బెటాలియన్‌ను మోహరించనుంది. ఇప్పటివరకు ట్రంప్ ప్రభుత్వం ఇన్సరెక్షన్ యాక్ట్‌ను అమలు చేయలేదు. ఇది అమలయ్యే దశకు వెళ్లితే, పౌర చట్టాల అమలులో సైన్యం ప్రత్యక్షంగా పాల్గొంటుంది.

కాలిఫోర్నియా ప్రభుత్వం ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ… నేషనల్ గార్డ్, మెరైన్స్ మోహరింపును నిలిపివేయాలని కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. రాష్ట్ర అధికారం, ఫెడరల్ చట్టాలకు ఇది విరుద్ధమని రాష్ట్ర అధికారులు వాదిస్తున్నారు. గవర్నర్ గెవిన్ న్యూసమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే పంపిన 2,000 మందికి తోడు మరో 2,000 నేషనల్ గార్డ్ దళాలను ట్రంప్ పంపించనున్నారని తెలిపారు.
ఆందోళన షికానో పౌర హక్కుల ఉద్యమానికి స్ఫూర్తి
కాగా, హాలీవుడ్ చిత్ర పరిశ్రమ కేంద్రమైన లాస్ ఏంజిల్స్ నగరం.. గతంలోనూ అనేక ఆందోళనలు, నిరసనలకు కేంద్రంగా నిలిచింది. 1968లో తూర్పు ప్రాంతంలో 15 వేల మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనలకు దిగారు. తమను చిన్న చూపు చూస్తున్నారని, శ్వేత జాతీయులకు ప్రాధాన్యత ఇస్తూ.. మెక్సికన్ అమెరికన్లకు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థులు నిరసనకు దిగారు. పాఠ్యాంశాలను మార్చాలని, ద్విభాషా విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన షికానో పౌర హక్కుల ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. నిరసనలు అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై ఫ్లాష్‌బాంబులు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.
అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. ఇక, 1992లో నాటి రాడ్నీ కింగ్ నిరసన లాస్ ఏంజెలెస్ చరిత్రలోనే నిలిచిపోయింది. 1991లో ఆఫ్రో అమెరికన్ మోటారిస్ట్ రాడ్నీ కింగ్‌ను హింసించిన నలుగురు శ్వేతజాతి అధికారులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలకు దిగారు. వారంపాటు జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 50 మంది చనిపోగా.. 2,000 మంది గాయపడ్డారు. ఈ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్.. వేలాది నేషనల్ గార్డులను, సైనికులను, మెరీన్లను ఆ నగరంలో మోహరించారు. అలాగే, 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో లాస్ ఏంజెలెస్ అట్టుడికింది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ పేరుతో జరిగిన ఈ ఆందోళనలకు ఈ నగరం కేంద్ర స్థానమైంది.
Read Also: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: చారిత్రాత్మక క్షణం రేపే!