ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికా పౌరులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపైనా ఆ ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాల కోతలు, ప్రపంచ దేశాలపై ట్యాక్స్‌లు పెంచడం, అమెరికా వీసా నిబంధనల్లో మార్పుల వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టకుండా ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధం అయ్యారు.

బయటికొచ్చిన ఇంటర్నల్ మెమో
ప్రపంచంలోని 41 దేశాల ప్రజలపై అమెరికాలోకి అడుగుపెట్టకుండా ప్రయాణ ఆంక్షలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒక ఇంటర్నల్ మెమో బయటికొచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మొత్తం ఈ 41 దేశాలను 3 గ్రూప్‌లుగా విభజించనున్నారని సమాచారం. మొదటి గ్రూప్‌లో 10 దేశాలను చేర్చనున్నారు. అఫ్గానిస్థాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా లాంటి 10 దేశాలకు చెంది పౌరులకు అమెరికా వీసాల జారీ చేయడం పూర్తిగా నిలిపివేయనున్నారు.
దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు
ఇక రెండో గ్రూప్‌లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ వంటి దేశాలను చేర్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ దేశాలకు చెందిన పౌరులకు పర్యాటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మూడో గ్రూప్‌లో పాకిస్థాన్, భూటాన్
మరోవైపు.. మూడో గ్రూప్‌లో పాకిస్థాన్, భూటాన్ సహా మొత్తం 26 దేశాలు ఉన్నట్లు సమాచారం. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ లోపాలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఇస్తారు. ఒక వేళ ఆ దేశాలు ఆ ప్రయత్నాలు చేయడంలో విఫలం అయితే.. అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని అమెరికా యంత్రాంగం భావిస్తున్నట్లు ఆ మెమోలో ఉంది. అయితే ఈ లిస్ట్‌ను అమెరికా మీడియా సంస్థలు వెల్లడించగా.. ఆ జాబితాలో మార్పులు ఉండవచ్చని అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.