అమెరికాలో రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే అక్రమ వలసదారులను సొంతగూటికి పంపించేందుకు సిద్ధమయ్యారు. అటు విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా ఝుళిపించారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసకున్నారు ట్రంప్. అమెరికాలోని ప్రభుత్వ వెబ్ సైట్స్ పై ఉక్కుపాదం మోపారు.వాటిని సమూల ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గత రెండు రోజులుగా అగ్రరాజ్యంలో ప్రభుత్వ వెబ్ సైట్స్ అన్నీ మూసివేతకు గురైనట్లు అక్కడి మీడియా కోడైకూస్తోంది. ప్రభుత్వానికి చెందిన 1400 కు పైగా ఫెడరల్ సైట్లలో దాదాపు 350 వరకు సోమవారం మధ్యాహ్నానికి మూసివేసినట్లు సమాచారం. వీటిలో అమెరికాలోని డిఫెన్స్, కామర్స్, ఎనర్జీ, ట్రాన్స్ పోర్టేషన్, లేబర్ లాంటి కీలక సైట్లనూ మూసేసినట్లు తెలుస్తోంది. మూసేసిన సైట్లలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సుప్రీంకోర్టు సైట్లు కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రభుత్వ సైట్లు ఎప్పటినుంచి ప్రజల్లో అందుబాటులోకి లేకుండా పోయాయో మాత్రం స్పష్టత లేదు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ ను మస్క్ కంట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందేగా.. అయితే ట్రంప్ ప్రభుత్వాన్ని మస్క్ వెనక ఉండి నడిపిస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. దీనిపై ట్రంప్ ఘాటుగా స్పందించారు.మస్క్ .. తమ అనుమతి లేకుండా ఏ పనీ చేయరు.. చేయలేరు అని వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ అన్నంత పనీ చేశారు. అక్రమ వలస దారులతో అమెరికా నుంచి విమానం భారత్ కు బయల్దేరింది. అమెరికాకు చెందిన సీ-17 మిలిటరీ విమానం ద్వారా అగ్రరాజ్యంలోని వలస దారులను భారత్ కు తరలించినట్లు సమాచారం. మరో 24 గంటల్లో ఈ విమానం భారత రాజధాని దిల్లీలో ల్యాండ్ కానుంది.