ప్రముఖ పర్యటక దేశం బహమాస్‌కు వెళ్లే తమ పౌరులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం కీలక సూచనలు చేసింది. బహమాస్‌లో నేరాలు, షార్క్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని.. కాబట్టి అక్కడికి వెళ్లే అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే బహమాస్‌కు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం మార్చి 31న జారీచేసిన మార్గదర్శకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పర్యటకంగా ఎంతో గుర్తింపు పొందిన బహమాస్‌లో.. ఇటీవల నేరాలు పెరుగుతున్నాయి. కొందరు దుండగులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. మహిళలపై లైంగిక దాడులు, హత్యలు కూడా చేస్తున్నారు. అందుకే అమెరికా తన ప్రజలను బహమాస్‌కు వెళ్లొద్దని కోరింది.

సముద్ర తీరంలో షార్క్ దాడులు
బహమాస్ సముద్ర తీరంలో షార్క్ దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి స్విమ్మింగ్, బోటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. న్యూ ప్రావిడెన్స్, గ్రాండ్ బహమా దీవుల్లోని నసౌ, ఫ్రీపోర్ట్ ప్రాంతాల్లో నేరాలు అధికంగా ఉన్నాయని,ఆ ప్రాంతాలకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలని అడ్వైజరీలో సూచించారు. అక్కడ అద్దె గదులు కూడా సురక్షితం కాదని, ప్రైవేట్ సెక్యూరిటీ లేని చోట ఉండటం మంచిది కాదని తెలిపారు. అంతేకాదు, గదుల్లో దిగేవారు తలుపులు, కిటికీలను లాక్ చేసుకోవాలని, తెలిసిన వారు కాకపోతే తలుపు తెరవద్దని పేర్కొన్నారు.
బోటింగ్ పరంగా పలు ఆందోళనలు
బోటింగ్ పరంగా కూడా ఆందోళనలు ఉన్నాయని, అక్కడ పర్యవేక్షణ అంతంతమాత్రమేనని తెలిపింది. బోటింగ్ ప్రమాదం వల్ల గాయాలు, మరణాలు సంభవించిన ఘటనలు ఉన్నాయని చెప్పింది. ‘మీ చుట్టూ ఉన్న పరిస్థితేంటో గమనించండి, పబ్లిక్ టాయిలెట్లలోనూ అప్రమత్తంగా ఉండండి’ అని అమెరికా యంత్రాంగం హెచ్చరించింది.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
‘‘పర్యటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి తుపాకులు, ఆయుధాలు తీసుకెళ్తే చట్టరీత్యా నేరం’ అని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే విమానాశ్రయాల్లోనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని పేర్కొంది.