ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ కావడం తో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండగా, జంగా కృష్ణమూర్తి పదవి గతంలోనే రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయింది.
టీడీపీ-జనసేన పొత్తు
ఈ ఐదు స్థానాల్లో జనసేనకు ఒక సీటును టీడీపీ కేటాయించింది. ఈ క్రమంలో జనసేన తరపున కొణిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన నాలుగు స్థానాల కోసం టీడీపీ లోపల తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ నేతలు, ఎమ్మెల్సీలు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన నేతలు, ఇతర కోటాల్లో సీట్లు కోల్పోయిన నేతలుపోటీలో ఉన్నారు.మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, కొమ్మాలపాటి రవిచంద్ర, మాజీ మంత్రి కేఎస్ జవహర్, బుద్దా వెంకన్న, వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, రెడ్డి సుబ్రమణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, పరసా రత్నం, ఏఎస్ రామకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, మహ్మద్ నజీర్, షేక్ నాగుల్ మీరా ఉన్నారు. నెలాఖరుతో పదవీ కాలం ముగియనున్న అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావులు కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
నామినేషన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికకు చర్చలు జరుగుతున్నాయి. అగ్రకుల కోటాలో దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి.

పోటీ
బీసీ కోటా: మోపిదేవి వెంకట రమణ, బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్నలలో ఒకరికి అవకాశం లభించే అవకాశముంది. ఎస్సీ/మహిళా కోటా: మాజీ మంత్రి పీతల సుజాత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మైనారిటీ కోటా:మహ్మద్ నజీర్ పేరు చర్చలో ఉంది.టీడీపీ వర్గాల్లో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, బీసీలకు రెండు సీట్లు, ఓసీలకు ఒకటి, ఎస్సీ లేదా మైనారిటీ కోటాకు ఒకటి కేటాయించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అభ్యర్థులు ఖరారు
ఈ రోజుసాయంత్రం లేదా రాత్రికి చంద్రబాబు అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశముంది. ఆశావహులు అమరావతిలో తిష్ట వేసి, తమ పేర్లు ఖరారవుతాయా లేదా అని వేచి చూస్తున్నారు. కొందరు ఇప్పటికే నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.ఈ ఎన్నికలు టీడీపీ, జనసేన శ్రేణులకు ఎంతగానో ప్రాధాన్యమైనవే. అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.