దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి నిరీక్షణకు స్వస్తి పలికే అవకాశం ఉంది. అటు టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు కూడా ఈ విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈ విషయాలన్ని స్వయంగా రోడ్డు రవాణా , రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో వాహనదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఊరటనిచ్చే కొత్త విధానం
ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, ఛార్జీల మోతతో సతమతమవుతున్న వాహనదారులకు ఈ కొత్త విధానం నిజంగా ఊరటనిచ్చే అంశం. టోల్ వసూళ్లలో పారదర్శకత, వేగం పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సంవత్సరానికి రూ.3,000 లేదా 15 సంవత్సరాలకు ఒకేసారి రూ.30,000 చెల్లించేలా వార్షిక , జీవితకాల టోల్ ఫీజులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చు. శాటిలైట్ టోలింగ్, ANPR టెక్నాలజీతో టోల్ వసూళ్లు సులభతరం!
అభివృద్ధికి టోల్ ఛార్జీలు అవసరం
మౌలిక సదుపాయాల అభివృద్ధికి టోల్ ఛార్జీలు ఎంతో అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. “మంచి రోడ్డు కావాలంటే దానికి డబ్బు చెల్లించాలి అనేది మా విధానం” అని ఆయన కుండబద్దలు కొట్టారు. నాణ్యమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు టోల్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జాతీయ రహదారుల ఫీజు నియమాలు: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు జాతీయ రహదారుల ఫీజు నియమాలు, 2008 ప్రకారం నడుస్తాయి. 2023-24లో టోల్స్ ద్వారా రూ.64,809.86 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35% ఎక్కువ కావడం విశేషం.