Gold rate today : పసిడి ప్రియులకు మరోసారి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరిగి మళ్లీ రికార్డు గరిష్ఠాల దిశగా దూసుకుపోతున్నాయి. అదే సమయంలో వెండి ధర బంగారాన్నే మించి వేగంగా ఎగబాకడం గమనార్హం. దీంతో గోల్డ్, సిల్వర్ కొనాలనుకునే వారికి పరిస్థితి మరింత భారంగా మారింది. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణం కారణంగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది మొత్తాన్ని గమనిస్తే బంగారం ధర 70 శాతానికి పైగా పెరగగా, వెండి ధర ఏకంగా 170 శాతం కంటే ఎక్కువగా ఎగబాకింది. ఇక తగ్గుతాయనుకున్న ప్రతీసారి, అంతకంటే ఎక్కువగా పెరిగి కొత్త రికార్డులు సృష్టించాయి. 2025 చివర్లో మాత్రం మూడు రోజుల పాటు భారీగా పతనం కనిపించినా, అది ఎక్కువకాలం నిలవలేదు.
మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగడం, ముఖ్యంగా (Gold rate today) అమెరికా–వెనెజువెలా పరిణామాలు మార్కెట్లను కుదిపేశాయి. వెనెజువెలాపై అమెరికా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని అమెరికాకు తరలించడం వంటి ఘటనలు అంతర్జాతీయంగా ఆందోళన పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు మరోసారి సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండివైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు భారత్‌పై సుంకాలు పెంచే అవకాశముందంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు కూడా మార్కెట్లను కలవరపెడుతున్నాయి.
Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య
ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఒక్కరోజులోనే 50 డాలర్లకు పైగా పెరిగి ఔన్సుకు 4470 డాలర్ల స్థాయికి చేరింది. కిందటి రోజు ఇది 4420 డాలర్ల వద్ద ట్రేడైంది. వెండి ధర అయితే మరింత దూకుడుగా పెరిగి ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటింది. నిన్నటి వరకు ఇది 75 డాలర్ల పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్లో బుధవారం ఉదయం తర్వాత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
ఇప్పటికే దేశీయంగా ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.550 పెరిగి తులం రూ.1,27,250కు చేరింది. నిన్న ఇదే ధర రూ.2,200 వరకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇవాళ రూ.600 పెరిగి 10 గ్రాములకు రూ.1,38,820 వద్ద కొనసాగుతోంది. నిన్నటి పెరుగుదలతో కలిపితే రెండు రోజుల్లో భారీ ఎత్తున ధరలు పెరిగినట్టే.
బంగారంతో పాటు వెండి ధర కూడా వరుసగా ఎగబాకుతోంది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధర రూ.6,000 పెరిగి రూ.2.71 లక్షలకు చేరింది. నిన్నటి రూ.8,000 పెరుగుదలతో కలిపితే రెండు రోజుల్లోనే వెండి ధర రూ.14,000 పెరిగింది. గతేడాది చివర్లో మూడు రోజుల్లో రూ.28,000 తగ్గిన వెండి, ఇప్పుడు మళ్లీ గరిష్ఠాల వైపు దూసుకుపోతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: